అరుదైన పాము.. 8 దశాబ్దాల తర్వాత మళ్లీ

85 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన సర్పం. ఉత్తరప్రదేశ్‌లోని దుద్వా టైగర్ రిజర్వ్‌లో దర్శనం. నారింజ రంగులో రైలు పట్టాలపై మెరిసిపోయిన పాము.. ఆసక్తికర వివరాలివిగో..

ఎనిమిది దశాబ్దాల కిందట కనిపించిన ఓ అరుదైన పాము మళ్లీ దర్శనమిచ్చింది.

భారతదేశంలోని అరుదైన సర్ప జాతుల్లో ఒకటైన ‘రెడ్‌ కోరల్‌ కుక్రి’ దాదాపు 82 ఏళ్ల తర్వాత యూపీలోని దుద్వా టైగర్‌ రిజర్వ్‌ (డీటీఆర్‌)లో కనిపించింది.

ఈ అరుదైన సర్పాన్ని సోమవారం రాత్రి అధికారులు గుర్తించారు. దీని శాస్త్రీయనామం ‘ఆయిల్‌ గోడాన్‌ ఖేరిన్‌సిస్‌’. ఖేరి ప్రాంతంలో వీటి మనుగడ ఎక్కువగా ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చింది.

దుద్వాలోనే తొలిసారి 1936లో కనిపించిన రెడ్‌ కోరల్‌ కుక్రి.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తారసపడటం విశేషం.

సోమవారం రాత్రి అటవీ అధికారుల బృందం దక్షిణ సోనారిపూర్‌ రేంజ్‌ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ పాము కనిపించింది.

సమీపంలోని రైల్వే పట్టాలపై నారింజ రంగులో మెరిసి పోతున్న పామును అధికారులు గుర్తించారు.

గతంలో ఎప్పుడూ చూడని పాము కావడంతో.. అధికారుల బృందంలోని ఒకరు దాన్ని ఫొటో తీశారు. ఆ పాము వివరాల గురించి శోధించగా ‘రెడ్‌ కోరల్‌ కుక్రి’గా తెలిసింది. ఆ పాము పొడవు మీటరు పొడవున్నట్లు అధికారులు చెప్పారు.

2004లో ఇలాంటి పామునే కతర్నియా ఘాట్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చరీలో చూసినట్లు ఓ అధికారి తెలిపారు.

రెడ్‌ కోరల్‌ కుక్రి విష సర్పం కాదని.. పురుగులు, కీటకాలను తిని బతుకుతుందని అధికారులు తెలిపారు. ఎరుపు, నారింజ రంగుల్లో ఉంటుందని వివరించారు.

ఈ సర్పం ఎక్కువగా రాతి ప్రదేశాల్లో కనిపిస్తుందని తెలిపారు. ఈ జాతి సర్పాలు ఎక్కువగా నేపాల్‌లో ఉంటాయట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *