విజయవాడ ప్రజలకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే…సీఎం జగన్

విజయవాడ ప్రజలకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు పూర్తి స్థాయిలో తీరబోతున్నాయి.
విజయవాడ నగరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
విజయవాడలో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
విజయవాడ మధురా నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఈ మేరకు బుధవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ విజయవాడలోని ట్రాఫిక్ సమస్యపై స్పందించారన్నారు.
రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని పేర్కొన్నారు.
రూ. 17 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రూ.10 కోట్ల రైల్వే నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని మంత్రి బొత్స వెల్లడించారు.
వచ్చే 6 నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానున్నట్లు ప్రకటించారు.
అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం తలపెట్టారని తెలిపారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో తెలుగు దేశం పార్టీ నాయకులు అడ్డుపడ్డా, స్టే తెచ్చినా ఏదో ఒక టైంలో తీర్పు వస్తుందని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామన్నారు. అలాగే శాసన రాజధాని అమరావతి నుంచి తీసేస్తామని మంత్రి కొడాలి నాని అనలేదని, రైతులు మానవత్వంతో ఆలోచించాలనే ఉద్దేశం తప్ప, అందులో మరో ఆలోచన లేదన్నారు.
విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నారని చెప్పారు.
త్వరలోనే రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా జగన్ మోహన్ రెడ్డి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదని, కచ్చితంగా రాబోయే రోజుల్లో విజయవాడ అభివృద్ధి మరింతగా జరుగుతుందని తేల్చి చెప్పారు