తిరుప్పావైలో 3వ పాశురం

అమ్మ గోదాదేవి శ్రీ వ్రతాన్ని ఆచరిస్తూ కీర్తిస్తున్న పాశురములలో మూడవ పాశురం ఈరోజు చెప్పుకోబోతున్నాం.

దివ్యమైన భావంలో చెప్తున్నదేమిటంటే మేము ఈ కీర్తనలో స్వామియొక్క పేర్లను కీర్తిస్తాం అని చెప్తున్నారు. అంటే ఈ వ్రతంలో ప్రధానం భగవత్సంకీర్తన. అది రెండవ పాశురంలో కూడా ప్రస్తావన చేశారు. ఎటువంటి భగవానునియొక్క పేర్లు మేము పలుకుతున్నాం అంటే ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి – ఓంగి అంటే పెరిగి; ఉళగు అంటే లోకములను; ఆళంద అంటే కొలిచిన; తాను పెరిగి ఈ లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఉత్తమునియొక్క నామములను మేము కీర్తిస్తున్నాం. తాను పెరిగి లోకాలను కొలిచినవాడు అంటే వామనుడై వచ్చి త్రివిక్రముడై పెరిగి ముల్లోకాలూ ఆక్రమించినటువంటి పురుషోత్తముడు.

ఈ వ్రతం చేస్తూ ఈ నీరాడడం వల్ల వచ్చే ఫలితములేమిటి? అవి తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు – అంటే ఈతిబాధలు లేకుండా ఈ దేశమంతా క్షేమంగా ఉంటుంది. ఇది మొదటి ఫలితంగా చెప్పారు. భగవత్ సంకీర్తన వల్ల ఈతిబాధలు పోతాయి అని చెప్పారిక్కడ. అంటే అనావృష్టి, అతివృష్టి ఇలా పంటలకి వచ్చే ఈతిబాధలు కొన్ని చెప్పారు. ఇవి మొత్తం ఆరు – అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, క్రూరులైనటువంటి పాలకులు – వీళ్ళ వల్ల పంటలకు హాని కలుగుతూంటుందిట. ఈ హాని కలగకుండా, ఈ ఆరుగురి బాధా లేకుండా ఉండడాన్ని ఈతిబాధలు లేకుండా ఉండడం అని అంటారు. ఈ దివ్య సంకీర్తన వల్ల ఈతిబాధలు లేకుండా పంటలు పండుతాయి. ఎంత చక్కగా పండుతాయి అంటే ఇక్కడ చెప్తూన్నారు.

తింగళ్ ముమ్మారి పెయ్దు – అంటే నెలకి మూడు వానలు కురుస్తాయి:  ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప – ఇక్కడ పెరిగినటువంటి పంటచేల మధ్యలో చేపలు ఎగురుతూ ఉంటాయి అని వర్ణించారు. పైగా వికసించిన తామర పువ్వులలో పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప – వికసించినటువంటి తామర పువ్వులలో/కలువ పువ్వులలో ఈ తుమ్మెదలు చేరి హాయిగా నిద్రిస్తున్నాయిట. నిద్రిస్తున్నాయి అంటే ఆనందంగా అక్కడ నిలిచి ఉన్నాయి. అలాంటి వాతావరణం ఏర్పడుతున్నది. శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్ – ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే జంకకుండా కొట్టంలో ప్రవేశించి అంటే పశువులయొక్క కోష్టంలోకి వెళ్ళి ఈ గోపాలకులు పాలు పితుకుతున్నారుట.

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ – ఆవిధంగా కొట్టములలోకి చేరి చక్కటి పొదుగులు కలిగినటువంటి ఆవుల వద్ద కూర్చొని – పొదుగులు ఎలా ఉన్నాయి అంటే బలిసిన పొదుగులుట. అంటే పుష్టి కలిగిన గోవులు అవన్నీ కూడా. అందుకే అక్కడికి వెళ్ళేవాళ్ళు మంచి ధైర్యవంతులే వెళ్ళి ఆ పాలు పితుకుతున్నారు. ఆ పుష్టి కలిగిన పొదుగులనుంచి ఆ పాలని పిదికేటప్పుడు ఆ పాలు కుండల నిండా సమృద్ధిగా ఇస్తున్నాయిట ఆవులు. పళ్ళల్ పెరుం పశుక్కళ్ – పైగా కుండలనిండా; క్కుడం నిఱైక్కుం – ఆ దివ్యమైనటువంటి కలశాలనిండా ఉదారముగా అంటే ధారాళంగా ఏమాత్రం తగ్గకుండా ఆ పశువులు పాడిని ఇస్తూన్నాయి. ఇలా నీంగాద శెల్వం నిఱైందే – ఈమాట చాలు. మొత్తం సారభూటంగా చెప్తున్నటువంటి మాట. ఈవ్రతం యొక్క ఫలితం ఏమిటంటే నీంగాద శెల్వం నిఱైందే – అంటే శాశ్వతమై తరగనటువంటి సంపద నిలిచి ఉంటుంది. మొత్తానికి భగవత్ సంకీర్తన, ఈ వ్రతము.
ఆ వ్రత ఫలం ఏమిటంటే తరగని సంపద నిలిచి ఉండుట. భక్తులు చేసే వ్రతములు, తపస్సులు ఒక పంట పండించుకోవడం లాంటిది. జన్మ సాఫల్యం పొందాలి. దానికోసం సాధన చేసేటప్పుడు ఈ దివ్యమైన భగవత్ సంకీర్తన వల్ల ఈ వ్రతాల వల్ల ఏం జరుగుతోంది అంటే సాధనకున్న ఆటంకాలు తొలగిపోతాయి.

అది ఈతిబాధలు తొలగడమంటే. అలాగే సాధన వృద్ధి చెందడానికి కావలసినటువంటి అనుకూలతలు వస్తాయి. అనుకూలతలే నెలకి మూడు వానలు కురియడము అనేటటువంటి భావంలో చెప్తున్నారు. పైగా పెరిగినటువంటి పంట చేల మధ్యలో చేపలు ఎగురుతూ ఉంటాయి అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటంటే ఆ సాధనవల్ల మనలో ఉత్పన్నమైనటువంటి జ్ఞానాంకురములు సస్యములై వచ్చినప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి రసమయ భావనలు ఎగురుతూ ఉంటాయి అంటే అర్థం ఆ హర్షంతో మనస్సులో ఉప్పొంగుతూ ఉంటాయి దివ్య భావాలు. ఆ దివ్య భావాలే ఇక్కడ మత్స్యములుగా చెప్పబడుతున్నాయి.  పైగా వికసించిన కలువ పూలలో తుమ్మెదలు నిద్రిస్తున్నాయి అంటే అర్థం ఏమిటంటే ఆ భావనలో అంతర్ముఖమైనటువంటి చిత్తవృత్తులేవైతే ఉన్నాయో అవి ఆ కృష్ణ ధ్యానంలో పరవశించిపోయి నిశ్చలంగా ఉండిపోయాయి. తుమ్మెదలు నిశ్చలంగా ఉండడం ఎప్పుడవుతుంది? – మకరందాన్ని బాగా ఆస్వాదించి ఆ పారవశ్యంతో ఉండిపోయాయి. అలాగే అంతరంగ కమలంలో ఆ భగవన్ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆ చిత్తవృత్తులనే తుమ్మెదలు ఆ శాంతిని పొందుతూన్నాయి అనే భావాన్ని చూపించారు.

పైగా ఆవుపాల పొదుగుల నుంచి కుండలనిండా పాలు వస్తూన్నాయి. అని చెప్పడంలో ఇక్కడ సాధన ఫలమైనటువంటి అమృతత్త్వ ప్రాప్తి. ఆ అమృతత్త్వమే ఇక్కడ క్షీరముగా చెప్పబడుతున్నది. క్షీరం అంటేనే సాత్త్వికతకీ, ఆనందానికీ, పోషకత్వానికీ సంకేతం. భక్తుడిని పోషించేది భగవద్ధ్యానామృతం. భగవత్ సంకీర్తనామృతం. భగవత్ స్మరణామృతం. ఆ స్మరణామృతం నిండుగా లభిస్తోంది.
నీంగాద శెల్వం నిఱైందే – తరగని సంపద లభిస్తున్నది. ఇది మనం భక్తిపరంగా అన్వయించి చూపించుకున్నాం. కనుక మనం చేసిన సాధనలన్నీ దేనికోసం? పరమాత్మను పొందడం కోసం. ఆ పరమాత్మను పొందడం అనే సాధనా ఫలం మనకు ఈ వ్రతం వల్ల తప్పకుండా లభిస్తున్నది అని తల్లి ఈ కీర్తనలో మనకి చూపిస్తూన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *