వితంతు పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు జగన్ సర్కార్‌పై సీరియస్..

జగన్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్.. భర్త బతికుంటే వితంతువని ఎవరైనా చెప్తారా?
వితంతు పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. వితంతు పెన్షన్లు నిలిపివేయడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
రాజకీయ కారణాలతో వితంతవులకు పెన్షన్లు నిలిపివేశారంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వ కౌంటర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వితంతువులంటూ కొందరు అబద్దాలు చెబుతున్నారనడంపై హైకోర్టు మండిపడింది. ఏ మహిళ కూడా భర్త జీవించి ఉంటే వితంతువునని చెప్పదని, ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వారి ఆర్థిక కష్టాలను కొంత వరకు తీరుస్తుందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఈ సాయం విషయంలో ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించింది.
అలాగే పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇవ్వమని ఎవరైనా అడిగారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
కోట్లు వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యమని ఎవరైనా అడిగారా? అని కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడాన్ని ఎవరూ కాదనరని స్పష్టం చేశారు.
అయితే పెన్షన్లు ఆపిన వితంతువులకు 15 రోజుల్లోగా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే పాత పెన్షన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కూడా పెన్షన్లు చెల్లించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.