గుడి, మసీదు, చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మిస్తామని …ముస్లిం మత పెద్దలతో సీఎం శనివారం సమావేశమయ్యారు.

కొత్త సచివాలయ నిర్మాణం: ముస్లిం మతపెద్దలతో సీఎం భేటీ.. కీలక నిర్ణయాలు

కొత్త సచివాలయంలో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం శనివారం సమావేశమయ్యారు.

వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించారు.

కొత్తగా నిర్మించబోయే రాష్ట్ర సచివాలయంలో గుడి, మసీదు, చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రకటించారు.

గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.

త్వరగానే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కొత్త సచివాలయంలో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం శనివారం సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించారు.

‘‘పాత సెక్రటేరియట్ భవనాలు కూల్చి వేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది.

వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్‌తో సహా రెండు మసీదులు ప్రభుత్వం నిర్మిస్తుంది.

పాత సెక్రటేరియట్‌లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తాం’’

‘‘1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిర నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం పూర్తయ్యాక దీన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తాం.

కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రైస్తవుల కోరిక మేరకు చర్చిని కూడా నిర్మిస్తాం.

తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. గంగా జమునా తహజీబ్‌కు ప్రతీక. అందుకే కొత్త సెక్రటేరియట్‌లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు నిర్మిస్తాం.’’

‘‘అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్థలం కూడా కేటాయించింది. కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది.

వెంటనే ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఖబ్రస్థాన్‌లు రావాల్సిన అవసరం ఉంది. స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరాం. వారు కొన్ని స్థలాలు గుర్తించారు.

నగరంలోని వివిధ చోట్ల మొత్తం 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్‌లు ఏర్పాటు చేస్తాం.’’

‘‘రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తున్నాం. ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడతాం.

అందుకోసం అధికార భాషా సంఘంలో ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ సంఘంలో ఉర్దూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తాం.’’

ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాహబ్ తదితర ముస్లిం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *