కేసీఆర్ కేరళ టూర్ వెనుక అసలు కారణం అదేనా… ఆ ముద్ర తొలగించుకుంటారా ?

కేరళ సీఎం విజయన్‌తో చర్చించడం ద్వారా జాతీయస్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేయడానికి సుముఖంగానే ఉన్నట్టు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన ఏం చేసినా… అందులో ఏదో ఒక రాజకీయ కోణం ఉంటుందనే చాలామంది విశ్లేషిస్తుంటారు.
తాజాగా కేరళ టూర్‌కు బయలుదేరిన గులాబీ బాస్… అక్కడ అనంత పద్మనాభస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్‌తో చర్చలు జరుపనున్న కేసీఆర్… ఫెడరల్ ఫ్రంట్‌లో వామపక్షాలు కూడా చేరాలని కోరనున్నారు.
ఈ మేరకే కేరళ సీఎం విజయన్ చొరవ తీసుకుని ఆ పార్టీ జాతీయ నేతలకు ఒప్పించాలని కేసీఆర్ కోరనున్నట్టు తెలుస్తోంది.
కేరళ సీఎం విజయన్‌తో చర్చించడం ద్వారా జాతీయస్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేయడానికి సుముఖంగానే ఉన్నట్టు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు.
అయితే కేసీఆర్ కేరళ టూర్ వెనుక మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం జాతీయస్థాయిలోని నేతల్లో ఉంది.
బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీలు పోరాటం చేసిన సమయంలోనూ కేసీఆర్ వారికి మద్దతు ఇవ్వలేదనే అపవాదు ఉంది.
ఈ అపవాదును తొలగించుకోవడం కోసమే కేసీఆర్ కేరళ టూర్ ప్లాన్ చేశారని… లెఫ్ట్ పార్టీలకు చెందిన సీఎంతో చర్చలు జరపడం ద్వారా బీజేపీకి తాము దూరమనే సంకేతాలను జాతీయ నేతలకు ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
తాను బీజేపీకి దూరమని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను కూడా తనవైపు తిప్పుకోవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావాలని భావిస్తున్న కేసీఆర్… ఇందుకోసం లెఫ్ట్ పార్టీ పాలనలో ఉన్న కేరళను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.