స్నేహితుడి కూతురితో సంబంధం.. అనుమానంతో హత్య

గుంటూరు జిల్లాలో మరొో జ్యోతి ఆరిపోయింది. స్నేహితుడి కుమార్తె (20)తో వివాహేతరం సంబంధం పెట్టుకున్న 40 ఏళ్ల ఓ వ్యక్తి అనుమానంతో యువతిని కిరాతకంగా కడతేర్చాడు.

గుంటూరులో దారుణం జరిగింది.

  • 1.జ్యోతి హత్యోదంతం మరవక ముందే మరో జ్యోతి ఆరిపోయింది.
  • 2.స్నేహితుడి కుమార్తె (20)తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి (40)
  • 3.అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు.

గుంటూరు జిల్లాలో మరో ‘జ్యోతి’ ఆరిపోయింది. అమరావతి నవులూరు స్టేడియం సమీపంలో ప్రియుడి చేతిలో జ్యోతి దారుణ హత్యోదంతం ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది.

స్నేహితుడి కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా కడతేర్చాడు.

తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్లిన వేళ ఈ దారుణం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలోని ఇస్లాంపేటలో గురువారం (ఫిబ్రవరి 21) మధ్యాహ్నం జరిగిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.

తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన సత్యనారాయణ (40) ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితుడి కుమార్తె జ్యోతి (20)తో అతడు సాన్నిహిత్యం పెంచుకున్నాడు.

సత్యనారాయణ భార్య ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది.

స్నేహితుడి కుటుంబంతో సన్నిహితంగా ఉండే సత్యనారాయణ తరచూ అతడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అతడి కుమార్తెతో సాన్నిహిత్యం పెరిగింది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది.

జ్యోతి ఇటీవల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు సత్యనారాయణ అనుమానించాడు. ఈ విషయాన్ని నిలదీయడానికి ప్రయత్నిస్తున్నాడు.
గురువారం ఉదయం జ్యోతి తల్లిదండ్రులు ఆమెకు ఓ పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి బంధువులతో కలిసి ఏలూరు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సత్యనారాయణ జ్యోతి ఇంటికి వెళ్లాడు.

మరో వ్యక్తితో సంబంధం గురించి జ్యోతిని సత్యనారాయణ నిలదీయడంతో వారిరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సత్యనారాయణ ఆమెను గొంతుకోసి హతమార్చాడు.

అనంతరం పోలీసుల వద్ద లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చేంత వరకు హత్య విషయం స్థానికులకు తెలియకపోవడం గమనార్హం.

సత్యనారాయణను అందుకే అనుమానించలేదు! జ్యోతి హత్య విషయం తెలిసి చుట్టుపక్కల వారు షాక్‌కు గురయ్యారు.

వడ్డీ వ్యాపారం చేసుకుంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండే సత్యనారాయణ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే నమ్మలేకున్నామని కొంత మంది స్థానికులు చెబుతున్నారు.

పెళ్లీడుకు వచ్చిన తమ కూతురు ఇకలేదనే వార్త తెలిసి జ్యోతి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

జ్యోతి పెళ్లికి నగదు సాయం చేస్తానని సత్యనారాయణ తన మిత్రుడికి మాటిచ్చినట్లు తెలుస్తోంది.పెళ్లి సంబంధాల విషయం చర్చించడానికి అతడు జ్యోతి ఇంటికి పలుమార్లు వచ్చినట్లు సమాచారం. దీంతో స్థానికులకు అతడిపై అనుమానం రాలేదని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed