ఏపీ రైతాంగానికి విత్తనాల కొరత కారణంగా రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి తలెత్తింది…ఈ పరిస్థితి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్షాలు అసలు తప్పెవరిది?

ఏపీ రైతాంగానికి విత్తనాల కొరత.. జగన్, చంద్రబాబుల్లో తప్పెవరిది?

ఏపీలో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు ఉపక్రమిస్తున్నారు. కానీ విత్తనాల కొరత కారణంగా రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి తలెత్తింది.

ఈ పరిస్థితి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

కాస్త ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుండటంతో.. ఖరీప్ సాగు కోసం రైతన్నలు సన్నద్ధం అవుతున్నారు.

కానీ సాగుకు కీలకమైన విత్తనాలు సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల ఆంధ్రా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

విత్తనాల కోసం అన్నదాతలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విత్తన సమస్య ఎక్కువగా ఉంది.

ఈ విషయమై అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు రైతాంగానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నామని.. ప్రస్తుత సర్కారు విత్తనాలను సరఫరా చేయడంలో విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విత్త‌నాలు జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే.. చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నా అని అంటున్నారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

కానీ అధికార పార్టీ నేతల వాదన మరోలా ఉంది. విత్తనాల కొరతకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని అధికార పక్ష నేతలు విమర్శిస్తున్నారు.

జూన్‌ 8 వరకూ తానే సీఎం అన్న చంద్రబాబుకు.. ఖరీఫ్‌ సీజన్‌లో అవసరమయ్యే విత్తనాలు సేకరించాలనే ఆలోచన కూడా లేదా? అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

విత్తనాల సేకరణ కోసం ఏపీ సీడ్స్‌కు రూ.380 కోట్లు చెల్లించకుండా.. ఆ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని ఆయన ఆరోపించారు.

నిధులు లేకపోతే విత్తనాలను సేకరించలేమని, రాయితీ సొమ్ము విడుదల చేయాలని గతంలో పదే పదే లేఖలు రాసినా బాబు సర్కారు స్పందించలేదని కన్నబాబు తెలిపారు.

ఈ ఏడాది 4.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటే.. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 50 వేల క్వింటాళ్లను మాత్రమే సేకరించారన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక 2.70 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేసి రైతులకు అందజేశామని, మరో 50 వేల క్వింటాళ్లను అందుబాటులో ఉంచామన్నారు.

నెటిజన్లలో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. 30 రోజుల్లో విత్తనాలను సేకరించడం సాధ్యం కాదని.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పని చేసి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

అప్పుడు విత్తనాలను సేకరించలేదు కాబట్టి.. తప్పు మీదేనంటున్నారు. తప్పు ఎవరిదైనప్పటికీ.. రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరుసటి ఖరీఫ్ నాటికైనా ఇలాంటి సమస్యలు లేకుండా చూడాలని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *