ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు… మంత్రి బొత్స వెల్లడించారు…

రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి బొత్స
ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో అతి త్వరలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు జరుగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మంగళవారం (జులై 2)తో పాలకవర్గాల గడువు ముగిసిన 9 కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.

విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ కమిషనర్ల వర్క్‌షాప్‌కు మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

మున్సిపల్ ఎన్నికలు జరిగేవరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని వెల్లడించారు. వార్డు సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్లు, విలీన గ్రామాల అంశాలు లాంటి కొన్ని అవరోధాలు ఉన్నాయని..

సీఎం వైఎస్ జగన్‌ ఆదేశాలకు మేరకు సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు.

అంతా బాగుందనే భావన వద్దు..
ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబంలో సభ్యులేనని.. వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని బొత్స సూచించారు.

త్వరలోనే కమిషనర్ల బదిలీలు ఉంటాయని.. వారికి కేటాయించిన ప్రాంతానికి వెళ్లి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కమిషనర్లు పని చేయాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు రాకుండా కాగితాల్లో అంతా బాగుందనే భావన తీసుకురావొద్దని అధికారులకు మంత్రి బొత్స హితవు పలికారు.

నెల రోజుల కిందట అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పూర్తి స్నేహపూర్వకమైందని.. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండబోవని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *