అయోమయంలో పాక్‌: యుద్ధం తప్పదా.?

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అంటూ పాకిస్తాన్‌పై యుద్ధం విషయంలో వందకోట్ల మందికి పైగా భారతీయులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తూనే వున్నారు.

అలాంటి సందర్భాల్ని స్వయంగా పాకిస్తాన్‌ కల్పించింది.. తీవ్రవాదాన్ని పెంచి పోషించడం ద్వారా.

కానీ, యుద్ధం చివరికి వినాశనాన్నే మిగుల్చుతుంది. ఇందులో ఇంకోమాటకు తావులేదు. అయినాసరే, రోజూ చచ్చేకంటే, తాడోపేడో తేల్చుకోవడమే బెటర్‌.. అన్న అభిప్రాయం మెజార్టీ భారతీయుల్లో వ్యక్తమవుతూ వస్తోంది.

పాకిస్తాన్‌ వద్ద అణ్వాయుధాలే వుండొచ్చుగాక.. చైనా నుంచి పాకిస్తాన్‌కి మద్దతు దొరకొచ్చుగాక. అయినాసరే, భారత్‌ ఏమాత్రం తీసిపోదు.. ఆ రెండు దేశాలతో పోల్చితే. దేశాన్ని కాపాడుకోవడం, ప్రత్యర్థిని దెబ్బతీయడం..

ఈ రెండు వ్యూహాలతో భారతదేశం సైనిక పాఠవం పరంగా రోజురోజుకీ బలోపేతమవుతూనే వచ్చింది.. వస్తోంది కూడా.! భారత్‌ – పాక్‌ మధ్య గతంలో పలు యుద్ధాలు జరిగాయి.. అన్నిటిలోనూ, పాకిస్తాన్‌ ఓడిపోతూనే వస్తోన్న దరిమిలా, ఈసారి యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్‌ పరిస్థితేంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌తో భారతదేశం ఉలిక్కిపడింది. 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. తాజాగా, నేడు సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరహాలో మెరుపుదాడి చేసింది. అయితే, భారత వాయుసేన దాడిచేసింది పాకిస్తాన్‌లో కాదు, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో. దౌత్య పరంగా ఎలాంటి సమస్యలూ భారత్‌కి రాకుండా వుండేందుకు ఇదొక సానుకూల అంశం.

‘మా భూభాగంలోకి భారత వాయుసేన విమానాలు వచ్చాయి..’ అంటూ పాకిస్తాన్‌ ప్రకటించేసింది. అయితే, ‘మేం తరిమికొట్టాం..’ అంటూ షరామామూలుగానే పాక్‌ బుకాయించిందనుకోండి.. అది వేరే విషయం. ఈ ఘటనపై చైనాతో పాకిస్తాన్‌ మంతనాలు షురూ చేసింది.

భారత్‌పైకి దూసుకెళ్ళడం తప్పదా.? అన్న కోణంలో పాకిస్తాన్‌ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఉన్నతస్థాయి సమావేశమూ నిర్వహిస్తున్నారు. ‘పాకిస్తాన్‌కి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పాం, వంకర తీరకపోతే ఇంకా గట్టిగా చెప్పడానికి సిద్ధంగా వున్నాం..’ అని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించేసింది. ప్రకటించడమేకాదు, సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది కూడా.!

భారతదేశం 12 మిరాజ్‌ యుద్ధ విమానాల్ని పంపితేనే, పాకిస్తాన్‌కి చెందిన యుద్ధ విమానాలు బెంబేలెత్తి వెనక్కి పరుగులు తీశాయి. ఒక్కసారిగా భారత్‌ తరఫున వందలాది యుద్ధ విమానాలు పాకిస్తాన్‌ వైపుకు దూసుకెళితే పరిస్థితి ఏంటి.? జలాంతర్గాములు రంగంలోకి దిగితే పాకిస్తాన్‌ ఏమయిపోతుంది.?

భారత సైనిక పాఠవం గురించి పాకిస్తాన్‌కి బాగా తెలుసు. అందుకే, పాకిస్తాన్‌ తోక జాడించే పరిస్థితి ఇప్పుడు వుండకపోవచ్చు. కానీ, మరిన్ని తీవ్రవాద దాడుల్ని మాత్రం పాక్‌ ప్రోత్సహించే అవకాశం వుంది గనుక.. అప్రమత్తంగా వుండాల్సిందే.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *