రివర్స్‌ గేర్‌ వేసి…పోలీసులకు చుక్కలు చూపించిన నాలుగేళ్ల బాలుడు

విజయవాడలో ఓ బుడతడు విజయవాడ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బెంజిసర్కిల్‌లోకి బ్యాటరీ కారుతో వచ్చి ట్రాఫిక్‌ పోలీసులను పరుగులు పెట్టించాడు.

పోలీసుల తనను గుర్తించారని గమనించిన ఆ నాలుగేళ్ల బాలుడు రివర్స్‌ గేర్‌ వేసి తప్పించుకోవాలని చూడడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.

నగరంలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారి కాలికి గాయమైంది. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దే ఉంచారు. 

ఎప్పటిలాగే బ్యాటరీ కారుతో వీధిలో ఆడుకుంటాడని భావించిన తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు.

 ఆ కారును నడుపుకుంటూ నగరంలో రద్దీగా ఉండే బెంజిసర్కిల్‌లోకి వచ్చాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో రోడ్డుపై బుడతడిని ట్రాఫిక్‌ సీఐ జగన్మోహన్‌రెడ్డి గుర్తించారు.

వెంటనే పోలీసులు చిన్నారి కారును ఆపేందుకు ప్రయత్నించారు. వాహనాలు అతడిని దాటుకుంటూ వెళుతుంటే పోలీసులు పరుగులు పెట్టారు.

వారిని చూసిన ఆ చిన్నారి రివర్స్‌ గేర్‌ వేసి ఇంటికి వెళ్లిపోవాలని చూశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకున్నారు.

ఇంతలో బాలుడిని వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించి వారిని హెచ్చరించి పంపించారు. బుడతడి చేష్టలు చూసి ముక్కున వేలేసుకోవడం స్థానికుల వంతైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *