కొండారెడ్డి బురుజును ధ్వంసం చేసిన జనసేన కార్యకర్తలు

జనసేన కార్యకర్తలు చిక్కుల్లో పడ్డారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్… ఆదివారం కర్నూలు పట్టణంలోని కొండారెడ్డి బురుజు వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు.

అక్కడికి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు చారిత్రక కొండారెడ్డి బురుజుపైకి ఎక్కారు. 

దాదాపు 2000 వేల మంది అక్కడి సిబ్బందిని ధిక్కరించి మరీ బురుజులోకి వెళ్లారు.

అంతటితో ఆగకుండా అక్కడున్న పూల కుండీలను ధ్వంసం చేశారు. కొన్ని శిలలను కూల్చేశారు. రక్షణగా ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్లను విరిచేశారు. గేట్లను పగులగొట్టారు.

ఈ చర్యలపై పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణచైతన్య తీవ్రంగా స్పందించారు. వందలాది మంది కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా అన్ని వైపుల నుంచి బురుజుపైకి ఎక్కేశారని వివరించారు. బురుజుకు నష్టం కలిగించారని చెప్పారు.

అయితే కొందరు జనసేన నేతలు … నష్టపరిహారం కింద 50వేలు ఇచ్చేందుకు తనను సంప్రదించారని వివరించారు.

కానీ తాము అందుకు అంగీకరించలేదని చెప్పారు. చరిత్రకు సాక్ష్యంగా ఉండే కట్టడాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీని కలుస్తామని చెప్పారు.

భవిష్యత్తులో ఏ మీటింగ్‌కు కూడా బురుజుకు 100 మీటర్ల సమీపంలో అనుమతులు ఇవ్వొద్దని ఆయన కోరారు.

కొండారెడ్డి బురుజు సిబ్బంది కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో జనసేన కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాల్సిందిగా బురుజు సిబ్బందిని ఒప్పించేందుకు జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *