హస్తినలో ధర్మపోరాట దీక్ష మొదలు… నిప్పులు చెరుగుతూ చంద్రబాబు ప్రసంగం

CM Chandrababu to Announce MLA Candidates List for AP

CM Chandrababu to Announce MLA Candidates List for AP

ఏపీ భవన్ వేదికగా ధర్మ పోరాట దీక్ష

కేంద్రంపై నిరసన తెలిపేందుకు వేల కిలోమీటర్ల దూరం వచ్చాం

పాలకులు ధర్మాన్ని పాటించడం లేదు

ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా, తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష మొదలైంది. దీక్షను ప్రారంభిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. “అందరికీ శుభాభినందనలు.

ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అదే విధంగా ఒక రాష్ట్రం పట్ల, ఒక ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.

ఆ న్యాయ పోరాటం కోసరమే మనమందరం ఇక్కడకు వచ్చాం. ఈరోజు చలిని కూడా లెక్కబెట్టకుండా మహాత్మాగాంధీ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి, అంబేద్కర్ కు నివాళులు అర్పించి, ఎన్టీఆర్ ఆత్మ సాక్షిగా మనందరం ఇక్కడ సమావేశమయ్యే పరిస్థితికి వచ్చాం.

ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది” అని చంద్రబాబు అన్నారు.

పార్లమెంట్ లో విభజన చట్టం పెట్టి, హామీలెన్నో ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారని, హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో, నాడు ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆ హామీల అమలుకు నిరంతరం పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు.

తాను న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష తలపెడితే, అందుకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారని, ఆ అవసరం ఇప్పుడేమొచ్చిందని ప్రశ్నించారు.

గోద్రా అల్లర్లలో గుజరాత్ పాలకులు ధర్మాన్ని విస్మరించారని నాడు వాజ్ పేయి స్వయంగా వ్యాఖ్యానించారని, వారే ఇప్పుడు పాలకులుగా ఉన్నారని విమర్శించారు.

విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, నాటి విపక్ష నేత, నేటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, నాటి ఎంపీ, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు హోదా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని, రూ. 16 వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉందని చెప్పిన చంద్రబాబు, కేంద్రం కేవలం రూ. 3,900 కోట్లుమాత్రమే ఇచ్చిందని అన్నారు.

విభజన చట్టంలోని 18 హామీలను నెరవేర్చాల్సి వుందని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకున్న ఘనత కేంద్రానిదని నిప్పులు చెరిగిన ఆయన, విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామన్న హామీని నెరవేర్చలేదని, ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే హస్తినకు వచ్చామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *