యాత్ర సినిమా పై #దొరా విశ్లేష‌ణ‌

బ‌యోపిక్ ల పై నాకు ఆస‌క్తి ఉండ‌దు. ఆ సినిమాల జోలి స‌హ‌జంగా నేను వెళ్ల‌ను. అలాంటిది యాత్ర సినిమా చూశాను. ఈ చిత్రం గురించి చాలా విన్నాక ఆల‌స్యంగా చూశాను.

“విడుద‌లైన త‌ర్వాత నాలుగు రోజుల కు ఈ సినిమా గురించి రాయాల్సిన అవ‌స‌రం ఇంక ఏముంటుంది.? ఇప్ప‌టికే లెక్క‌లేన‌న్ని రివ్వూలు వ‌చ్చేశాయి.

విమ‌ర్శ‌కుల్ని సైతం మెప్పించిన సినిమాగా నిల‌బ‌డింది. జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. ఆదివారం సినిమా చూశాను.

ఇప్పుడు రివ్వూ రాసినా ఎవ‌రూ చ‌ద‌వరులే” అని మౌనంగా ఉన్నాను. కానీ సినిమా ప‌దే ప‌దే వెంటాడుతుండ‌టం, రాయాల్సిన కొన్ని విష‌యాలు ఉన్నాయ‌ని నిర్ధారించుకోవ‌డం మూలంగా ఇదిగో ఇలా ఈ రివ్వూ పుట్టుకొచ్చింది.

వాస్త‌వానికి ఇది రివ్వూ కాదు. యాత్ర సినిమా చూశాక నాలో జ‌రిగిన సంఘ‌ర్ష‌ణే ఇది. నాకు నేను వేసుకున్న ప్ర‌శ్న‌లు- వాటికి నాకు నేను చెప్పుకుంటున్న స‌మాధానాలే ఇవి.

రామ‌కృష్ణ అనే నాకు, #దొరా అనే నాలోని ర‌చ‌యిత‌కు జ‌రిగిన ఈ సంభాష‌ణ‌ను మీరూ వింటార‌ని ఆశ ప‌డుతూ, నా “రాత యాత్ర ” మొద‌లుపెడుతున్నాను.

రామ‌కృష్ణ ప్ర‌శ్న : యాత్ర సినిమా గురించి ఇంత ఆల‌స్యంగా స్పందించ‌డం అవ‌స‌ర‌మా..?

దొరాజ‌వాబు : అవ‌స‌ర‌మే. రాయాల్సిందే. క‌థానాయ‌కుడు సినిమా విడుద‌ల అయితే సినీ ప‌రిశ్ర‌మ మొత్తం ఆహా.. ఓహో.. అంటూ స్పందించింది.

అద్భుత సినిమా (నేను చూడ‌లేదు) అంటూ ఘీంకార ధ్వ‌నుల‌ను వినిపించింది.

పోటీ లు పడి ట్వీట్లు వదిలారు. చెవుల‌కు చిల్లు, సెల్లుల‌కు సొల్లు దిక్క‌య్యాయి.

నిజ‌మే కామోసనుకున్నాను. తీరా చూస్తే సినిమా కోట‌ప్ప” కొండ ” ఎక్కింది. యాత్ర సినిమా విడుద‌లైంది. ఒక్క సినీ పెద్ద మ‌నిషి కూడా ఈ సినిమా బాగుంది చూడండి.. అనే వ్యాఖ్యే చేయ‌లేదు.

మ‌రీ దారుణం ఏంటంటే.. క‌థానాయ‌కుడు సినిమాకు మ‌హేష్ బాబు ట్వీట్లు వ‌దిలారు.

యాత్ర సినిమా విష‌యంలో అదో సినిమా ఉంద‌నే విష‌యమే త‌న‌కు తెలీన‌ట్లు “న‌టించేస్తున్నారు.” ప‌ద్మాల‌య స్టూడియోను క‌ష్టాల క‌డ‌లి నుంచి ఒడ్డుకు తెచ్చి.. అప్పుల్లో ఉన్న కృష్ణ కుటుంబం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తేలా వైఎస్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కోసం ఆ కుటుంబం ఇసుక రేణువంత సాయం చేస్తే.. వైఎస్ ఆ కుటుంబానికి నిస్వార్థంగా సాయం చేశారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ప్ర‌తిప‌క్ష పార్టీ పొలి కేక‌లు వేసినా ప‌ట్టించుకోలేదు.

అలాంటి వైఎస్ సినిమా విడుద‌లైతే.. ప‌సివాడి న‌వ్వులా, స్వాతి ముత్యంలా, చిగురుటాకులా స్వ‌చ్ఛంగా ఆ చిత్రం ఉంటే.. క‌నీసం మ‌హేష్‌బాబు కుటుంబం నుంచి ఒక్క ట్వీటు కూడా లేదు.

ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు సైతం టీడీపీలో చేరిపోయి య‌థావిధి ప్ర‌సంగాలు ఇస్తున్నారు.

ఇలాంటి కుటుంబ ప‌ల్ల‌కీనా ఇన్నాళ్లూ వైఎస్ అభిమానులు మోసింది..? వీరి కోస‌మా వైఎస్ ఆనాడు అంత పెద్ద రిస్క్ చేసింది..?

క‌థానాయ‌కుడు సినిమాకు రెండు ట్వీటులు వ‌దిలిన మ‌హేష్‌బాబు.. యాత్ర సినిమాను పూర్తిగా విస్మ‌రించ‌డం అత్యంత నేర‌మే.

క‌థానాయ‌కుడు సినిమాకు జూనియ‌ర్ ఎన్టీ ఆర్ సైతం ఒక్క ట్వీటు కూడా చేయ‌ని విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.

అక్కినేని నాగార్జున స‌రేస‌రి.. ఒకే వ‌ర్గం సినీ ప్ర‌పంచాన్ని ఏలుతున్న సంద‌ర్భాన్ని చీల్చుకుంటూ, ప్ర‌భంజ‌నం సృష్టిస్తూ యాత్ర సాగిస్తున్న విజ‌య‌విహారం ముమ్మాటికీ సినీప‌రిశ్ర‌మ‌కు క‌నువిప్పే.

మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క స్పంద‌న లేదు. సినీ ప‌రిశ్ర‌మ‌లో మిగిలిన‌వారంద‌రి సంగ‌తి ఏమోగాని క‌నీసం మ‌హేష్ బాబు, అక్కినేని నాగార్జున నుంచైనా ఈ సినిమా పై స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశించి భంగ‌ప‌డ్డాను.

వారిపై నాకు క‌లిగిన క‌సే ఈ సినిమా గురించి స్పందించేలా చేసింది. అందుకే రాస్తున్నాను ” మిస్ట‌ర్ ఆర్కే”

రామ‌కృష్ణ : హో.. గ్రేట్‌.. ఇంత‌కీ సినిమా ఎలా ఉంది దొరా

దొరా: సినిమాలో మెరుపుల్లేవు.. కానీ గుండెను పిండేసే మ‌రుపులు ఉన్నాయి. ఎలాంటి మ‌లుపుల్లేవు. అయితే హృద‌యాన్ని తాకే త‌ల‌పులు ఉన్నాయి.

మ‌ళ్లీ ఓడిపోతే అంటూ.. 2004 ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ ప‌డిన ఆత్మ సంఘ‌ర్ష‌ణ ఈ సినిమాను న‌డిపించ‌డానికి ఇరుసులా ప‌నిచేసింది.

నేను థియేటర్‌లో కూర్చున్న‌ది నిజ‌మే. నా ముందు తెర ఉన్న‌ది నిజ‌మే. కానీ ఆ తెర‌పై నేను చూసింది మాత్రం సినిమాను కాదు.

2004కు ముందు ఉన్న మా ఊరిని. మా ఊరి రైతును నేను ఆ సినిమాలో చూశాను.

అప్ప‌ట్లో రైతు ప‌డిన క‌ష్టాన్ని చూశాను. నాన్న ఇంట్లో జీవాన్ని అమ్ముతుంటే ఓ పిల్లోడు ఆ గొర్రెను గ‌ట్టిగా కావ‌లించుకుని ఏడుస్తూ ఈ సినిమాలో నాకు క‌నిపించాడు కానీ.. ఆ పిల్లాడు ఎవ‌రో కాదు నేనే.

అప్ప‌ట్లో టీడీపీ హ‌యాంలో ఓ పెద్దాయ‌న అప్పు తీర్చేందుకు నాకు ఎంతో ఇష్ట‌మైన మా గేదెను మా నాన్న తెగ‌న‌మ్ముతుంటే.. దానితో నాకున్న అనుబంధాన్ని నేను తెంచుకోలేక గుక్క‌లు ప‌ట్టి ఏడ్చిన సంఘ‌ట‌న అమాంతం నాకు గుర్తొచ్చింది.

అందుకే ఆ సినిమా మా ఊరిదే. ఆ స‌న్నివేశంలో ఏడ్చింది నేనే. బాగా న‌వ్విస్తేనే కాదు.. గుక్క‌లుప‌ట్టి ఏడ్చేలా చేసినా సినిమా హిట్ట‌వుతుంద‌ని యాత్ర రుజువు చేసింది.

మా ఊరి రైతు క‌ష్టం. మా ఊరి ప‌సిపాప మృత్యు రోద‌న‌, మా ఊరి అవ్వ వృద్ధాప్య‌పు క‌ష్టాలు… ఇవ‌న్నీ నేను యాత్ర సినిమాలో చూశాను.

రామ‌కృష్ణః అవును దొరా ఇంత‌కు యాత్ర సినిమా హిట్ అవ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏంటి..?

దొరాః ఈ సినిమా హిట్ట‌వ‌డానికి ముమ్ముట్టి న‌ట‌నా ప్ర‌తిభ‌, రాఘ‌వ్ తుల‌నాత్మ‌క ద‌ర్శ‌క‌త్వం, కృష్ణ‌కుమార్ విన‌సొంపైన సంగీతం, నిండైన ఎడిటింగ్‌…. ఇవ‌న్నీ క‌చ్చితంగా కార‌ణాలే.

అయితే నా దృష్టిలో ఈ సినిమా ఇంత బాగుండ‌టానికి అయినా, ఇంత‌గా విజ‌యం సాధించ‌డానికి కార‌ణం అయినా వైఎస్ అనే ఓ మ‌హోన్న‌త‌వ్య‌క్తి. ఓ అవ్వ త‌న అవ‌స్థ‌లు చెబుతుండ‌గా.. ప‌క్క‌నే కూర్చున్న వైఎస్ వాటిని శ్ర‌ద్ధ‌గా వింటుండ‌టాన్ని చూడ‌గానే ఠ‌క్కున ఆ మ‌హానేతే గుర్తొస్తాడు.

వైఎస్ ఇప్పుడు ఉండి ఉంటే ఎంత బాగుండో అని అనిపించేలా చేస్తాడు. ఓ రైతు గుణ‌పం లాంటి త‌న క‌ష్టాన్ని వెళ్ల‌బోసుకుంటుంటే వైఎస్ ప‌డే బాధ‌.. ఇత‌డు క‌దా నాయ‌కుడంటే అనిపించేస్తుంది.

ఆ వెంట‌నే ఆయ‌న అందించిన రైతు సంక్షేమ పాల‌న గుర్తొస్తుంది.

రైతుకు వైఎస్‌ ఎందుకు అంత అండ‌గా ఉన్నాడో ప్రేక్ష‌కుడికి తెలిసొచ్చి సంతృప్తి చెంద‌డం మొద‌లుపెడ‌తాడు.

ఆస్ప‌త్రిలో ఓ చిన్నారి త‌న చెల్లెలి వైద్యం కోసం ప‌డే ఆరాటం, కూతురిని బ‌తికించుకోవ‌డానికి చేతిలో చిల్లిగ‌వ్వ‌లేని ఆ అమాయ‌క‌పు త‌ల్లి ప‌డే ఆవేద‌న‌.. వీట‌న్నింటినీ క‌ళ్లారా చూస్తూ చ‌లించిపోయే వైఎస్‌… ప్రేక్ష‌కుడికి ఇంత‌కుమించి ఏం కావాలి..? క‌ళ్ల‌లో నుంచి ఉబికి వ‌చ్చే ఆ క‌న్నీళ్ల‌ను ఆప‌టం ఎవ‌రికైనా సాధ్య‌మేనా..? క‌ష్టాల‌ను అంత ద‌గ్గ‌రి నుంచి వైఎస్ చూడ‌టాన్ని ప్రేక్ష‌కుడు మెచ్చుకున్నాడు.

నాయ‌కుడంటే ఇత‌డేరా అంటూ త‌న‌కు తాను స‌ముదాయించుకున్నాడు. అందుకే ఈ సినిమా విజ‌యం సాధించ‌డానికి మ‌ర‌ణించిన ఆ దివంగ‌త మ‌హానేత వైఎస్సే కార‌ణం.

రామ‌కృష్ణ : ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూడాలా.. అని ఎవ‌రి నుంచైనా ప్ర‌శ్న ఎదురైతే నువ్వు ఏం స‌మాధానం చెబుతావు?

దొరా : క‌చ్చితంగా చూడ‌మ‌ని చెబుతాను. క‌న్నీరు క‌రువైన కన్ను.. త‌న లోప‌లి పొర‌ల నుంచి ఉబికివ‌స్తున్న జ‌లాల‌తో త‌న ద‌ప్పిక తీర్చుకుంటుంది.

ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. వైఎస్ అనే ఒక చారిత్ర‌క రాజ‌కీయ శ‌క్తిని మ‌రోసారి గుర్తు చేసుకోవ‌చ్చు. నాయ‌కుడంటే ఎలా ఉండాలో తెలుసుకోవ‌చ్చు.

స‌మాజంలో ఎలా మ‌స‌లుకోవాలో తెలియ‌క నాయ‌క‌త్వ‌లేమి అనే రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతున్న నేటి ఎంద‌రో న‌యా నేత‌ల‌కు ఈ సినిమా ఒక పాఠం. నాయ‌కుడంటే ఎలా ఉండాలో నేర్పే ఒక అధ్యాయం.

జ‌నంపై స‌హ‌జ‌మైన ప్రేమ ఉంటే ఆ నాయ‌కుడు ఎలా ఉంటాడో చెప్పే సినిమా ఇది. అందుకే క‌చ్చితంగా చూడాల్సిందే.

వైఎస్ చ‌నిపోయే నాటికి కేవ‌లం 15 నుంచి 20 ఏళ్ల వ‌య‌సు మాత్ర‌మే ఉండి ఉంటుంది.. అలాంటి వారు నాకు థియేట‌ర్‌లో 20 శాతం మంది క‌నిపించారు.

ఆదివారం సినిమాకు వెళితే టికెట్టు దొర‌క‌డం గ‌గ‌న‌మైపోయింది.

జ‌నాల‌కు మేలు చేసే నాయ‌కుల‌ను జ‌నం ఎప్ప‌టికి మ‌రిచిపోరు బ్రో ” అంటూ Raju Chintham అన్న, ” మా నాన్న చ‌నిపోయిన‌ప్పుడు కూడా నేను ఏడ‌వ‌లేదు స‌ర్‌.

యాత్ర సినిమా చూస్తుంటే నేను అప్పటివరకు పెద్ద‌గా ఎరుగ‌ని రోదానానుభ‌వం నాకు ఎదురైంది.. ” అంటూ ఆత్మీయుడు Vikarthan Reddy నాతో అన్న మాట‌ల‌ను ఎందుకో నాకు ఇక్క‌డ పంచుకోవాల‌నిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *