వెలుగులోకి బాబు ఘనకార్యం!

తెలుగు నేల విభజన తర్వాత తీవ్ర ఆర్థిక లోటుతో కొత్త పయనం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే తనలాంటి అనుభవ శాలి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డప్పులు కొట్టుకుని జనాన్ని మాయ చేసి సీఎం పదవిని దక్కించుకున్నారు.

2014లో టీడీపీ డంబాచారానికి లోనైన రాష్ట్ర ప్రజలు బాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆ ప్రజల ఆశలను చంద్రబాబు అడియాశలే చేశారు.

గడచిన నాలుగేళ్లలో రాజధాని అమరావతిలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణాన్ని కూడా కట్టించలేని చంద్రబాబు…

రాష్ట్రాన్నిమాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు.

బాబు చేసిన ఈ ఘనమైన పాలన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈ మాటేదో చంద్రబబు అంటే గిట్టని పార్టీనో ఏపీలో విపక్ష హోదాలో ఉన్న వైసీపీనో చెప్పిన మాట కాదు.

సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా నిరూపించిన పచ్చి నిజం. ఈ నిజం బయటకు వచ్చేలా చేయడంలో వైసీపీ ప్రధాన కార్యదర్శిఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి తనదైన శైలి సత్తా చాటారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సాయిరెడ్డి సంధించిన ఓ ప్రశ్నకు ఈ సంచలన విషయం బయటపడిపోయింది.

నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.74962 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు… ఇకపై రాష్ట్రానికి చిల్లిగవ్వ అప్పు కూడా పుట్టకుండా చేసేసింది. వెరసి ఎంత అత్యవసరమైనా కూడా ఇప్పుడు రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు.

అయినా రాష్ట్రానికి ఇకపై రుణాలు ఎందుకు దొరకవన్న కారణం చూస్తే… మనకు షాక్ తగలక మానదు. మనకు వనరులు లేక అప్పులు పుట్టడం కాదు… చంద్రబాబు సర్కారు నిర్దేశిత షరతులను పూర్తి చేయని కారణంగానే రాష్ట్రానికి అప్పులు పుట్టవట.

పాలనలో తనంత వాడు లేడన్న రీతిలో జబ్బలు చరుచుకునే చంద్రబాబు… ఆర్థిక లోటుతో అల్లాడుతున్న రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టకుండా మహా ఘన కార్యం చేశారన్న మాట.

సాయిరెడ్డి సంధించిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సుస్పష్ట సమాధానం ఇచ్చింది. కేంద్రం సమాధానం ఏమిటన్న విషయానికి వస్తే… 14వ ఆర్థిక సంఘం నిర్దేశితాల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో షరతులను పూర్తి చేయలేదు.

అదనపు రుణాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి అర్హత లేదు.

14వ ఆర్థిక సంఘం ఏపీ తెలంగాణ రెండింటికీ జీఎస్డీపీలో 3 శాతం మేరకు ఆర్థికలోటుకు పరిమితి విధించింది.

అయితే రుణ జీఎస్డీపీ నిష్పత్తి 25 శాతం దాటకుండా వడ్డీ చెల్లింపులు-ఆదాయ వసూళ్ల నిష్పత్తి 10 శాతం మించకుండా ఉంటే ఈ ఆర్థికలోటు పరిమితిలో కూడా సడలించే వీలుంది.

ఈ ప్రాతిపదిక ప్రకారం తెలంగాణకు మాత్రమే రూ.2052 కోట్ల మేరకు అదనపు రుణాలు చేసేందుకు అర్హత లభించింది. 2018-19లో జీఎస్డీపీలో 0.25 శాతానికి సమానంగా ఈ మొత్తం ఉంటుంది.

అది 3 శాతం సాధారణ పరిమితికి అదనంగా లభిస్తుంది. ఇదే సమయంలో ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని 0.5 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ షరతులు పూర్తి చేయనందున రాష్ట్రానికి అర్హత లేదట.

ఇదీ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ చెప్పిన విస్పష్ట సమాధానం.

మరి రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమం ఎక్కడా ఆగకుండా చూడటంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు… ఈ సమాధానం విన్న తర్వాత ఏమంటారో చూడాలి.

అసలు ఈ విషయంపై ఆయనకు మాటైనా పెగులుతుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *