17 పేజీల వినతి పత్రం

వారి జాతకాలు విప్పితే తలెత్తుకోలేరు: చంద్రబాబు

దిల్లీ: ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవని, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం ఏమాత్రం ఆయనకు లేదని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 

తాము న్యాయం కోసం పోరాడుతుంటే, భాజపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి జాతకాలు విప్పితే మళ్లీ తలెత్తుకుని తిరగలేరని హెచ్చరించారు.

విభజన హామీలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సీఎం నేతృత్వంలోని బృందం మంగళవారం కలిసింది. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ 17 పేజీల వినతి పత్రం అందించింది.
విభజన చట్టంలోని అంశాలు, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదిరత అంశాలను సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రపతి రాజ్యంగపరమైన అధినేత అని, అంతిమంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.

తమకు న్యాయం జరగకుంటే కోర్టు తలుపులు తడతామని, అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే భాజపా కాలం వెళ్లదీస్తోందన్నారు.

అందుకు రాష్ట్రంలో వైకాపా సహకరిస్తోందన్నారు. భాజపా, వైకాపా కలిసి పోటీ చేయాలని చెప్పారు. రాష్ట్రంపై అంత చిత్తశుద్ధే ఉంటే తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోదా కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాకుళం వాసి మృతి పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *