శివరాంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి…

అసెంబ్లీ ఫర్నిచర్ కేసు.. కోడెల తనయుడికి హైకోర్టు కీలక ఆదేశాలు
దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కే ట్యాక్స్ పేరుతో జనం దగ్గర అడ్డగోలుగా వసూలుచేసి నిలువుదోపిడీ చేశారంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

దివంగత టీడీపీ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాంపై నమోదైన కేసుల్లో ఆయనకు ఇటీవల బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.

టీడీపీ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శివరాం అక్రమాలకు పాల్పడ్డారని పలు కేసులు నమోదుకాగా, వీటికి సంబంధించి బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. తాజాగా, అసెంబ్లీ ఫర్నిచర్‌ వ్యవహారంలో కోడెల శివరామ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

శాసనసభకు సంబంధించిన ఫర్నిచర్‌ గుంటూరులోని తన హీరో హోండా షోరూమ్‌కు కోడెల తనయుడు తరలించినట్టు ఆయనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు బుధవారం విచారణ చేపట్టారు.

శివరాం పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. అక్టోబరు 9లోపు దిగువ కోర్టులో లొంగిపోయి బెయిలు పొందాలని స్పష్టం చేశారు.

అంతేకాదు, రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని బెయిలు మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

కాగా, కోడెల శివరాం, ఆయన సోదరి విజయలక్ష్మిపై నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆయా కేసులకు సంబంధించి ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోరుతూ శివరాం హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు రెండు రోజుల కిందట ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో శివరాం మంగళవారం నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కోర్టులో లొంగిపోయి వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చారు.

సత్తెనపల్లిలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్ల అదృశ్యంపై కేసు నమోదైంది.

అలాగే తమపై దౌర్జన్యం చేసి ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని, బలవంతపు వసూళ్లు, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పలు కేసులు నమోదన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *