నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రాన్ని రివర్స్‌లో తీసుకెళ్తున్నారంటూ నారా లోకేష్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు…

కావాలి ఇసుక.. రావాలి కరెంట్.. జగన్ సర్కార్‌పై లోకేష్ సెటైర్లు

రాష్ర్టంలో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రాన్ని రివర్స్‌లో తీసుకెళ్తున్నారు. విసినకర్రల కాలానికి పట్టుకెళ్తున్నారంటూ నారా లోకేష్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపడంలో చురుగ్గా ఉంటున్న మాజీ మంత్రి నారా లోకేష్ ఈ సారి జగన్ సర్కార్‌పై పవర్ పంచ్ విసిరారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలను అలా పెంచుకుంటూ పోతున్నారని, మళ్లీ విసిన కర్రల కాలానికి తీసుకుపోయేట్టున్నారంటూ ఎద్దేవా చేశారు.

తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంట్ పోతే విచిత్రమని.. ఇప్పుడు కరెంట్ ఉంటే అదృష్టం అనే పరిస్థితి తీసుకొచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు.

అధికారంలోకి వచ్చింది మొదలు సరికొత్త పాలన అంటూ ఉంటే ఏంటో అనుకున్నామని, కేవలం నాలుగు నెలల్లోనే విద్యుత్ కోతలతో కొవ్వొత్తులు, విసనకర్రల కాలానికి తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరికీ అన్నింటా కోతల పాలన చూపిస్తున్నారంటూ విమర్శించారు. రివర్స్ ముఖ్యమంత్రి జగన్ అంటూ సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ని అంధకారప్రదేశ్ గా మార్చిన ఘనత సొంతం చేసుకున్నారని జగన్ సర్కార్‌పై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యుత్ కోతలు అలా పల్లెల నుంచి పట్టణాల వరకూ పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.

అధికార మత్తు, అనుచరుల భజనల మధ్య ప్రజల ఇబ్బందులు వినిపించడంలేదని, కావాలి ఇసుక, రావాలి కరెంటు అంటూ జనం హై పిచ్ లో పాడుతున్నారంటూ సెటైర్లు పేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *