డేటా వార్.. ఏపీలో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు…

డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులపై ఏపీలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఏపీ మంత్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

డేటా వార్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.
తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై కేసులు పెడితే.. ప్రతిగా ఏపీ పోలీసులు కూడా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

డేటా చోరీ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిపోయింది.

ఏపీ ప్రజల డేటాను చోరీ చేసిన వ్యవహారంపై సైబర్ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలిపెట్టారు.

సంస్థ ఎండీ దాకవరపు అశోక్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు చేపట్టారు.

ఈ వ్యవహారంలో కొంత సమాచారం సేకరించిన హైదరాబాద్ పోలీసులు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఏపీ ప్రజలకు చెందిన ఆధార్, ఓటర్ ఐడీ లాంటి సున్నితమైన సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

టీడీపీకి చెందిన ‘సేవా మిత్ర’ యాప్‌ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈరోజు నుంచే విచారణ చేపట్టింది.

మరోవైపు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ కేసులో తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైసీపీతో కలిసి తెలంగాణ పోలీసులే డేటాను దొంగిలించారని కంప్లైంట్ చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులపై ఐపీసీ 120బి, 418, 429, 380, 409, 167, 177, 180బి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ఏపీ పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *