డేటా చోరీ కేసులో: కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…

డేటా చోరీ కేసులో సిట్ ఏర్పాటు.. కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!
ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసులో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన డేటా చోరీ వ్యవహారం.
గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన జగన్, బీజేపీ నేతలు.
తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటుపై విజయశాంతి విమర్శలు.

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన డేటా చోరీ కేసులో నిజానిజాలను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

సిట్ ఏర్పాటు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై ఆమె విమర్శలు గుప్పించారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ద్వారా విచారణకు ఆదేశించడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు.

ఐటీ గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణపై తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.

పొరుగు రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు.

పొరుగు రాష్ట్రంలో జరిగే అన్యాయానికైతే సిట్ వేస్తారా…అదే తెలంగాణలో జరిగితే సిట్ (కూర్చోండి) అంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతారని ఆమె ధ్వజమెత్తారు.

కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్ధ అంటే ఇలాగే ఉంటుందేమోనని విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణలు గవనర్నర్ నరసింహన్‌ను కలిసన వెంటనే సిట్ ఏర్పాటు చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆరోపించారు.

మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతుందన్న వాదనలకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయన్న విజయశాంతి, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ ముసుగు తొలగిపోయి, బీజేపీ కోసమని తెలిసిపోతుందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed