డేటా చోరీ కేసులో సిట్ దూకుడు.. రంగంలోకి స్పెషల్ టీమ్‌లు

మూడు బృందాలుగా విడిపోయిన సిట్. ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన సమాచారం త్వరగా ఇవ్వాలని అమెజాన్, గూగుల్‌లకు లేఖ. ఢిల్లీకి వెళ్లిన సైబరాబాద్ సైబర్ క్రైం బృందం.

డేటా చోరీ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.
డేటా చోరీ కేసుకు సంబంధించిన వివరాలపై చర్చ.
సమాచారం త్వరగా ఇవ్వాలని అమెజాన్, గూగుల్‌లకు లేఖ.

డేటా చోరీ కేసులో ఏర్పాటైన సిట్ దూకుడు పెంచింది. గురువారం సమావేశమైన సిట్ బృందం కేసుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించింది.

ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పోలీస్ అధికారులు దృష్టిపెట్టారు.

కేసు విచారణకు సిట్‌ను మూడు బృందాలుగా విభజించారు. డేటా అనాలసిస్, డేటా రీట్రీవ్‌కు ఓ టీమ్.. కేసులో అనుమానితుల్ని ప్రశ్నించేందుకు మరో టీమ్.. ఐటీ గ్రిండ్ ఎండీ అశోక్ కోసం గాలించేందుకు మరో టీమ్‌ను నియమించారు.

అలాగే ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన సమాచారం త్వరగా ఇవ్వాలని అమెజాన్, గూగుల్‌లకు లేఖ రాశారు.

డేటా చోరీ కేసును దర్యాప్తు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం)ను బుధవారం (మార్చి 6) ఏర్పాటు చేసింది.

వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట ఎస్‌డీపీవో శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు రమేశ్, వెంకట్రామిరెడ్డిని సభ్యులుగా నియమించారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఐటీగ్రిడ్స్ సంస్థలోని కంప్యూటర్లు, సర్వర్లనుంచి వెలికితీసిన 80 జీబీ డేటా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి వెళ్లింది.

ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ యూఐడీఏఐ కార్యాలయంలోని అధికారులను కలిసి ఐటీగ్రిడ్స్ సంస్థ వద్ద ఉన్న డేటా గురించి ఆరా తీయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *