చంద్రబాబును తిట్టొద్దు – టీడీపీ వల్ల కాదు అని మాత్రమే చెప్పండి ! కొత్త లైన్ ఖరారు చేసింది బీజేపీ!

కప్పకి తెలవకుండా తాళం తియ్యడం చూశారా ఎప్పుడైనా ? చూడకపోతే ఏపీలో బీజేపీ పాలసీ చూడండి అర్థం అవుతుంది. చంద్రబాబు మీద గౌరవం ఉందట. ఆయన పెద్ద మనిషట. ఆయన్ని ఏమీ అనొద్దట. అలాగని టీడీపీని వదలొద్దట. చేరికలు చేసుకోవాలట. ఎవరెవరు వస్తారో లిస్టు తయారు చేసి, వర్గాల వారీగా ప్లాన్ సిద్ధం చేసి ఆకర్షించుకుంటూ వెళ్లాలట.

ఇదే వరసలో చంద్రబాబుపై మాత్రం విమర్శలు చేసినా, పరుషంగా మాట్లాడినా మాత్రం రాజకీయంగా నష్టం అట. ఇది బీజేపీ ప్లాన్. రాష్ట్ర నాయకులకే కాదు రాష్ట్రంతో సంబంధం ఉన్న నాయకులకి కూడా ఢిల్లీ నుంచి నేరుగా వచ్చిన వ్యూహాత్మతక వార్నింగ్ ఇది. ఎందుకు ఇలా ? చంద్రబాబు అంటే గౌరవం ! టీడీపీ అంటే మాత్రం కక్ష ఉంటుందా ? సాధ్యమేనా ? బీజేపీ లెక్కేంటి ? కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే – బీజేపీ ఏపీని అర్థం చేసుకుంది.

అందుకే కొత్త లైన్ ఖరారు చేసింది. జగన్ విధానాలు చూసిన తర్వాత, మొన్న ఎన్నికల ఫలితాలతో ఇప్పటికి పరిస్థితిని బేరీజు వేసుకున్నాక ఓ విధానం కాయిన్ చేసింది. జగన్ విధానాలతో చంద్రబాబుకి మైలేజీ పెరుగుతోంది. జనం ఆయన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తోంది.

ఆయన బెటర్ గా చేశాడని, ఇంతకు ముందు ఇలా లేదు అని అనుకుంటున్నారని అర్థం చేసుకుంది. ఆ ఫీలింగ్ ని కదిపితే వ్యతిరేకత తమ వైపు తిరుగుతుంది. చంద్రబాబుపై ఉన్న సింపథీని అలాగే ఉండనిచ్చి, అటు జోలికి పోకుండా టీడీపీని నరుక్కుంటూ రావాలన్నది పాయింట్. వైసీపీ బలంగా ఉంది. ప్రబలంగా ఉంది. టీడీపీ బలహీన పడింది. జగన్ విధానాలతో జనం మంటెక్కిపోతున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడే బావుందనే భావన వచ్చేస్తోంది.

అలాగని వైసీపీని ఎదిరించే పరిస్థితి బలం, బలగం టీడీపీకి లేవు అనిపించాలన్నది బీజేపీ ప్లాన్. వైసీపీని ఢీ కొట్టాలంటే బీజేపీకే సాధ్యం అనే ఫీలింగ్ తేవాలన్నది ప్లానింగ్. అదే వస్తే కనుక ఇక పని సులభం అవుతుంది. అందుకే తెలివిగా విగ్రహాన్ని కదపకుండానే అగ్రహారాన్ని అపహరించే పథకం వేస్తోంది. ఏపీలో పుంజుకోవాలంటే ఇప్పటికిప్పుడు రాజకీయం చేయాలంటే, ఇంతకు మించిన మార్గం లేదన్నది బీజేపీ ఆలోచన. వైసీపీకి మంద బలం ఉంది. బలగం ఉంది. టీడీపీ ఆ రెండూ లేవు.

జనం కోరుకుంటున్నారు, ఇప్పటి ప్రభుత్వం మీద గుడ్ లుక్స్ లేవు లాంటివి చెప్పుకోడానికి మాత్రమే సరిపోతాయ్. పవర్ పవరే కదా. గ్రౌండ్ లెవెల్లో ఢీ కొట్టేందుకు ఆ పవరే కావాలి. బీజేపీ కేంద్రంలో పవర్ ఉంది కానీ రాష్ట్రంలో ఏం లేదు. ఆ పాయింట్ తెలుసు. అందుకే కేంద్రంలో ఉన్న పవర్ ను చూపించి రాష్ట్రంలో నేతల్ని లాగితే బలం ఆటోమేటిగ్గా బ్యాలెన్స్ అవుతుందని అంటున్నారు కమలనాథులు. మామూలుగానే బీజేపీ వాళ్లకి పబ్లిక్ పల్స్ పట్టుకునే టాలెంట్ తక్కువ ఏపీలో ! అందుకే కసి కొద్దీ కన్నా లాంటి వాళ్లు చంద్రబాబును చెడతిడుతుంటారు.

ముందు ముందు ఇలాంటి పరిస్థితి మారొచ్చు. చంద్రబాబును జైల్లో పెడతాం, కేసులు పెడతామని కొందరు నాయకులు అంటే బీజేపీ నాయకత్వం వాళ్లని వారించింది తర్వాత తర్వాత. ఇప్పుడు కూడా అలాగే బాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలకు పోవద్దని చెబుతోంది. ఇది ఒక రకంగా మంచిదే.

ఎందుకంటే టీడీపీ బీజేపీల మధ్య అనవసర ఫ్రిక్షన్ ఉండదు. కాకపోతే బీజేపీలోకి వలసలను కంట్రోల్ చేసుకునేందుకు ఏం చేయాలో టీడీపీ ఆలోచించుకోవాలి. మొత్తానికి బీజేపీ ఇచ్చిన ఈ ఆదేశాల ప్రభావం తొందర్లోనే కనిపిస్తుంది అంటున్నారు. మరి ఇంత ప్లాన్ ప్రకారం, క్లినికల్ గా బీజేపీ వేస్తున్న ప్లాన్ ను టీడీపీ ఎలా తిప్పికొడుతుందో చూడాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *