కేసీఆర్, జగన్‌‌ల వద్దకు కాంగ్రెస్ దూతగా కమల్‌ నాథ్!

సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంటుండగా, కేంద్రంలో ప్రభుత్వాన్ని తామే తిరిగి ఏర్పాటుచేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది.

బీజేపీయేతర, తటస్థ పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు.
కేసీఆర్, జగన్‌ల వద్దకు దూతగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.
ప్రధాని పదవి దక్కకపోయినా బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్ వ్యూహం.

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుండగా, ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.

కేంద్రంలో ప్రభుత్వాన్ని తామే తిరిగి ఏర్పాటుచేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇందులో భాగంగా బీజేపీయేతర, తటస్థ పార్టీల మద్దతుకు ప్రయత్నిస్తోంది. మే 23న విపక్షాల నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని పలు పార్టీలకు ఇప్పటికే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆహ్వాన లేఖలు పంపారు.

తాజాగా, బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్‌‌ మద్దతు కూడగట్టే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి,

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోనూ కమల్ నాథ్ స్వయంగా మాట్లాడనున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆయన వెంట ఇద్దరు ఏఐసీసీ నేతలు కూడా రానున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చించి, వారి అభిప్రాయాలు, డిమాండ్లను తెలుసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.

అయితే, దీనిపై నోట మాట ద్వారా కాకుండా, లిఖిత పూర్వకంగా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు.

ఇక, ప్రధాని పదవి తమకు దక్కకపోయినా, బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనిపై ఏఐసీసీ సభ్యుడు గులాబ్ నబీ అజాద్ గురువారం మాట్లాడుతూ..

ప్రధానమంత్రి పదవి తమకు దక్కకపోయినా పర్వాలేదని, విపక్షాల మద్దతుతో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టకుండా అడ్డుకోవడంపైనే దృష్టిసారించామని అన్నారు.

ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాం, కానీ మా లక్ష్యం ఎల్లప్పుడూ ఎన్డిఏను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు.

తమకు మెజార్టీ రాని పక్షంలో ఏకగ్రీవ ఆమోదానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి సమస్యను సృష్టించబోమని అన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ..

టీఆర్ఎస్ మద్దతుతో రాహుల్ ప్రధాని అవుతారంటే తమకెలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. మాకు రాష్ట్రం కాదు పార్టీ ముఖ్యమని, రాహుల్ ప్రధాని కావడం మరింత ముఖ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *