జగన్ ఫస్ట్ ఫోకస్ అదేనా..? బాబుపై రివేంజ్‌ తీర్చుకోబోతున్నారా?

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్.. చంద్రబాబు అవినీతిపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా అమరావతి భూములు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి లాంటి అంశాలను ఆయన టార్గెట్ చేసుకోనున్నారని తెలుస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆదివారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి అనంతరం.. ఏపీ భవన్లో జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తాను చంద్రబాబుకు వ్యతిరేకం కాదని జగన్ అన్నారు.

కానీ బాబు హయాంలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా అమరావతి భూముల వ్యవహారంపై జగన్ ఫోకస్ పెట్టబోతున్నారని.. తెలుస్తోంది.

‘2014 మే నెలలో ఎన్నికల్లో గెలుపొందిన చంద్రబాబు.. ఆ ఏడాది డిసెంబర్‌లో రాజధానిని అమరావతి ప్రాంతంలో ప్రకటించారు. రాజధాని ఎక్కడ వచ్చేది బాబుకు ముందే తెలుసు.

కానీ వేరే చోట రాజధాని వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ.. అమరావతి ప్రాంతంలో బాబు, ఆయన బినామీలు రైతుల దగ్గర్నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారు. ఇది ఇన్‌సైడెడ్ ట్రేడింగ్.

లాండ్ పూలింగ్‌లో తన భూములు, తన బినామీల భూములను రాజధాని పరిధిలో పోకుండా జాగ్రత్త పడ్డారు. మిగతా భూములను బలవంతంగా సేకరించారు. ఇది సెన్సేషనల్ స్కాం కానుంది.

నేను చంద్రబాబుకు వ్యతిరేకం కాను. పాలనలో దేశానికి మేం ఆదర్శంగా నిలుస్తాం, అవినీతి లేకుండా చేస్తామని మాటిస్తున్నా.

మేం లేకపోయి ఉంటే ఇంకా దోచుకునే వాళ్లు. స్కాంలు జరిగిన పనులను క్యాన్సిల్ చేసి.. రివర్స్ టెండరింగ్ తీసుకొస్తాం’ అని జగన్ పేర్కొన్నారు.

అమరావతిలో భారీగా స్కాం జరిగిందని జగన్ బలంగా విశ్వసిస్తున్నారని ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది.

గతంలో ఓ నేషనల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ.. తాను అధికారంలోకి వస్తే చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని జగన్ స్పష్టం చేశారు.

రాజధాని భూముల వ్యవహారంతో మొదలుపెట్టి.. పోలవరం కాంట్రాక్టులు, తదితర అంశాల వారీగా చంద్రబాబు పాలనలో జరిగిన అవకతవకలపై జగన్ సర్కారు విచారణ జరిపించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *