కరోనా వచ్చినప్పటి నుంచీ ప్రతిరోజు మాస్క్ ధరించి ప్రధాని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిస్తున్నారని..రఘురామకృష్ణంరాజు!!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కావాల్సిన వ్యక్తి, ముఖ్య అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంతో నెల రోజుల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.

ఆ కేసులో విశాఖపట్నం నుంచి నేరుగా కర్నూలుకు తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చారు పోలీసులు.

ఆ తర్వాత నలంద కిషోర్ ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటోన్న మాట!

అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన… చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు విడిచారు.

ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని.. అంతలోనే మృత్యువు కబళించేసిందని తెలుస్తోంది.

అయితే వీరి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, కుమారుడు మాజీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అది అలా ఉంచితే రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగినా ఈ మధ్య వెంటనే స్పందించేస్తున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

నలంద కిషోర్ మృతి కలచి వేసిందన్న ఆయన ఈ ఘటన పట్ల తీవ్రంగా స్పందించారు.

ఢిల్లీలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్.ఆర్.ఆర్…. అమెరికా నుంచి పెట్టిన పోస్టింగ్ కోసం కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.

పోలీసుల వైఖరి కారణంగానే ఆయనకు కరోనా వచ్చిందని.. పోలీసులు రిపోర్ట్ లో ఏ వివరాలు వెల్లడిస్తారో చూడాలని తెలిపారు.

ఇక రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ దెబ్బతిన్నదని.. చాలా మందిపై అరిస్తే కరుస్తా అన్నట్లు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు.

అలాగే… ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును రాష్ట్ర ప్రభుత్వం హరిస్తుందని స్పష్టం చేశారు.

నలంద కిషోర్ మృతికి కారణమైన పోలీసుల అధికారులపై సీఎం చర్యలు తీసుకోవాలని ఆర్.ఆర్.ఆర్. డిమాండ్ చేశారు.

అసలు కరోనా పాజిటివ్ పేషెంట్ ల వార్డులో నలంద కిషోర్ ను పెట్టాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని అంటూ..

అది అన్యాయమని తెలిపిన ఆర్ఆర్ఆర్.. వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు విచారకరమని వివరించారు.

అంతటితో ఆగకుండా అసలు నలంద కిషోర్ మృతి పోలీసుల హత్యగా భావించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తన ప్రియమిత్రుడు పోలీసుల దమనకాండకు బలయ్యాడని.. ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులను సీఎం కాపాడాలని కోరారు.

ఇంకా మాట్లాడే హక్కు, జీవించే హక్కు లేకుండా ప్రజలు పడుతున్న భాధను సీఎం అర్ధంచేసుకోవాలని కోరారు.

అదే సమయంలో నిమ్మగడ్డ విషయాన్ని కూడా ప్రస్తావించారు ట్రిపుల్ ఆర్. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. రాష్ట్రప్రభుత్వం అదే ఆలోచిస్తుందని కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు.

ఇంకా ప్రస్తుత ఎన్నికల కమీషనర్ తో సుప్రీంకోర్టులో మరో పిటీషన్ వేయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా ఆయన చెప్పేశారు.

చివరగా కరోనాను టాపిక్ ఎత్తిన ఆయన… కరోనా నియంత్రణలో ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉండి మెరుగైన సేవలు అందిస్తుంటే.. ఏపీలో మాత్రం అలాంటిదేం జరగడం లేదన్నట్లు రఘురామరాజు మాట్లాడటం విడ్డూరమనే చెప్పాలి!

అలాగే.. కరోనా వచ్చినప్పటి నుంచీ ప్రతిరోజు మాస్క్ ధరించి ప్రధాని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిస్తున్నారని… కొంతమంది అది పాటించడంలేదని కొసమెరుపు సెటైర్ కూడా వేసేశారు రఘురామకృష్ణంరాజు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *