గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించాలని గతంలో నిర్ణయించిన ఇరువురు సీఎంలు మరోసారి భేటీ అవుతున్నారు…

జగన్‌కు ఫోన్‌‌చేసి ఎజెండా ఖరారు చేసిన కేసీఆర్.. నేడు కీలక చర్చలు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మరోసారి సోమవారం భేటీ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు చేరుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జూన్‌ 28న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పలు అంశాలపై ఇరువురూ చర్చించారు.

ముఖ్యంగా గోదావరి వరద జలాలు కృష్ణా బేసిన్‌కు తరలింపు, విభజన సమస్యలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. వృథాగా పోతున్న గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై చర్చించేందుకు సోమవారం మరోసారి జగన్, కేసీఆర్ భేటీ అవుతున్నారు.

ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సోమవారం జరిగే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

సీఎంలతోపాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా ఇందులో పాల్గొంటారు. గతంలో ముఖ్యమంత్రుల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రులకు అందజేశారు.

గోదావరి, కృష్ణా నదీ జలాల సంపూర్ణ వినియోగం, తొమ్మిది, పదో షెడ్యూల్లోని సంస్థల విభజన అంశాలపై కూడా ఇరువురూ చర్చించనున్నారు.

వీటితోపాటు మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నట్లు సమాచారం.

తొమ్మిది, పదో షెడ్యూలులోని అంశాలపై ఇప్పటికే సీఎంల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.

ఈ అంశంపై కేసీఆర్, జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. ప్రధానంగా అప్మెల్‌ వంటి సంస్థల విషయంలో ఏకాభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

తెలంగాణ, ఏపీలకు సంబంధించి అధికారుల బదలాయింపు, పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నాయి.

ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలను తెలంగాణకు అప్పగించారు.

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల బదలాయింపునకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్త ఇసుక పాలసీ రూపకల్పనలో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *