అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎందుకో చిన్న కథ రూపంలో తెలుసుకుందాం….

“అమ్మా…. ఈరోజు అన్నం తినను” అన్నాను అమ్మ తో.

అమ్మ చిన్నగా నవ్వింది ఏమీ మాట్లాడలేదు. మళ్లీ చెప్పాను. “ఎందుకట?” అంది‌ అమ్మ.
” ఈ రోజు శనివారం…. నువ్వు ఉపవాసం ఉంటువుగా.

రోజంతా తినకుండా ఉంటావు. మరి నేను ఉంటాను” అన్నాను. ” వద్దు నాన్న ఎదిగే వయసు నీది.

అన్నం చక్కగా తింటే బాగా పెరుగుతారు” అంది అమ్మ…..నేను తినను” గొడవ చేశాను. సరే అంటూ నవ్వింది అమ్మ.

అలా అని గంట అయ్యిందో లేదో కడుపులో ఆకలి మొదలయింది. నాలో పంతం ఎక్కువయింది. మరో గంట ఎలాగో ఓర్చుకున్నాను. ఇంకా నా వల్ల కాలేదు. శరీరమంతా నీరసించిపోయింది.

రోడ్డుమీద, టీవీల్లో వార్తా పత్రికల్లో ఎంతో మంది ఆకలితో దీనంగా చూడడం గుర్తుకొచ్చింది. ఆకలి బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది నాకు.

అమ్మకు తెలియకుండా అన్నం తినాలని వంటింట్లోకి దూరాను. గిన్నెలో అన్నం లేదు. ఏం చేయాలో తోచలేదు.

బాధతో కడుపు పట్టుకుని వెనుదిరిగాను. వెనకాలే అమ్మ, అమ్మ చేతిలో పళ్ళెం. పళ్ళెంలో వేడి వేడి అన్నం, గబగబా అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ చిన్నగా నవ్వుతూ అన్నం కలిపి ముద్దలు చేసి నోట్లో పెట్టి సాగింది.

అమ్మ ఆకలి భరించడం చాలా కష్టం. ఇంత ఆకలిని ఎలా భరిస్తారో కదా!” అన్నాను.

” అందుకే అన్నారు…. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని… అంటే అన్నం దేవుడున్నమాట. మరి నువ్వేమో రోజు అన్నాన్ని వదిలేస్తూ, పారేస్తూ నిర్లక్ష్యం చేస్తావు”, అంది అమ్మ.

పారేస్తే ఏమవుతుందమ్మా? అన్నం చాలా తేలిగ్గానే దొరుకుతుంది కదా! అన్నాను తింటూనే.

“తేలిగ్గా దొరుకుతుందా? ఎలా?” అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం.

“ఏముంది దుకాణంలోకెళ్ళి బియ్యం కొనుక్కోవడం. పొయ్యి మీద నీళ్ళలో ఉడికించి గంజి వార్చడం… అంతే కదా!” అన్నాను.

” మరి, దుకాణంలోకి బియ్యం ఎలా వస్తాయో తెలుసా?” అడిగింది అమ్మ.

తెల్లమొహం వేశాను. అమ్మ మళ్ళీ నవ్వింది. అన్నం తినిపిస్తూనే చెప్పడం మొదలు పెట్టింది.

“పల్లెల్లో పొలాలు, అందులో ఆకుపచ్చని వరి పైరు చూశావు కదా! వరి పైరు ద్వారా వడ్లు వస్తాయి. పడ్లను మరి పట్టిస్తే బియ్యం వస్తాయి” అంది.”మరి వడ్లను ఎలా పండిస్తారు? వివరంగా చెప్పవా? అడిగాను.

“ముందుగా పొలంలో నీరు నిల్వ ఉండడానికి పొలం చుట్టూ గట్లు వేస్తారు. ఆ గట్టు మధ్య పొలంలో ఒకసారి నాగలితో దున్ని మట్టిబెడ్డలు విరుస్తారు. అట్లా చేయడంవల్ల పాత ముక్కలు అన్నీ పోతాయి.

ఆ పొలంలోనే ఒక మూల చిన్న మడిగా చదును చేసి పెడతారు, మెత్తగా చేస్తారు.

తరువాత మొలకెత్తిన ధాన్యాం విత్తనాలు చల్లుతారు. అవి నీటితడికి మొక్కలుగా వస్తాయి. అప్పుడు ఆ మడి పచ్చని తివాచీ లాగా కనిపిస్తుంది. దీన్నే ‘నారుమడి’ అంటారు”.

అమ్మ అలా చెబుతూంటే నా కళ్ళముందర పచ్చని తివాచీ లాంటి పొలం కనిపించింది.

నేను కొన్నిసార్లు బస్సులో వెళుతున్నప్పుడు, మరి కొన్నిసార్లు టీవీల్లో, సినిమాల్లో చూశాను. అమ్మ చెబుతుంటే ఎంతో ముచ్చటేసింది.

” నారుమడిలో మొక్కలు మూరెడు పెరగగానే పొలాన్ని దుక్కిదున్ని సిద్ధం చేస్తారు.

ముందు నాగలితో లోతైన వాళ్ళుగా దున్నుతారు. నీరు పట్టించి తిరిగి దున్నీ దమ్ము చేస్తారు.
దమ్ము చేయడం అంటే పట్టీలాగా ఉండే ఒక పొడుగు కర్రతో చదును చేయడమన్నమాట.

అప్పుడు ఇందాక నారుమడిలో మొలిచిన మొక్కలుంటాయి కదా! వాటిని మూడేసి, నాలుగేసి మొక్కలను ఒకచోట నాటుతారు.

అలా కొద్ది కొద్దిగా దూరంలో వాటిని నాటుతూ పొలమంతా మొక్కల్ని నాటుతారు. దీన్నే ‘నాట్లు వేయడం’ అంటారు”.

అమ్మ అలా వర్ణించి చెబుతుంటే ఆ దృశ్యాలు నా కళ్ళ ముందర మెదులుతున్నట్లే అనిపించసాగాయి.

“మొక్కలు నాటుకున్న తరువాత దుబ్బులు వస్తాయి. అప్పుడు కలుపు మొక్కలు బయలుదేరుతాయి. వాటిని వెంటనే తీసి వేయాలి.

లేకపోతే భూమిలోని సారాన్నంతా అవే పీల్చుకుని, వరి మొక్కలను పరగకుండా చేస్తాయి. దీన్ని కలుపు తీయడం అంటారు.

ఆ తర్వాత మొక్క ఎదిగి పోట్టలుపోసుకొని పాలు చేస్తాయి. ఆ పాలే వరి కడుపులో ఎదిగి గింజకడతాయి. గింజ గట్టిపడి మొనదేలుతుంది. అలా పంట తయారైన తర్వాత కోతలు కోసి, ఆరనిచ్చి కుప్పలు వేస్తారు”.

అమ్మ ఒక్కోమాట చెబుతున్నకొద్దీ తింటున్నా అన్నం మరింత తియ్యగా కమ్మగా మారినట్లు అనిపించసాగింది.

“గుడ్లతో, ట్రాక్టర్లతో, యంత్రాలతో కుప్ప నూర్పిస్తారు. తరువాత చేటలతో చెరిగి ధాన్యాన్ని తూర్పారబోస్తారు.

ఇలా చేయడం వల్ల ధూళి, దుమ్ము పొల్లు పోయి గట్టీ ధాన్యపురాశి మిగులుతుంది. ధాన్యాన్ని బస్తాలలో నింపి బండ్లతో తోలి గాదెలలో నింపుతారు.

ఏడాదికి సరిపడా ఉంచుకొని మిగతాది అమ్మేస్తారు. అలా వడ్లను మరిపట్టిస్తే ఇదిగో మనం తినే ఈ బియ్యం తయారువుతాయి” అంది అమ్మ. తినడం పూర్తయింది.

అమ్మ కథ చెప్పడమూ పూర్తయింది. నేను తింటూండగా కింద పడ్డా కొన్ని మెతుకులు కనిపించాయి.అవి ఎంతో విలువైనవిగా అనిపించాయి.

“అమ్మ! ఇదంతా పండించడానికి ఎంత కాలం పడుతుంది”? అని అమ్మను అడిగాను. సుమారు నాలుగు నెలలు పడుతుంది. ఈ నాలుగు నెలల కాలంలో వర్షాలు కురవాలి.

విత్తనాలు మొలకెత్తాలి. ఎరువులు వేయాలి, పురుగు పట్టకుండా మందులు చల్లాలి. మధ్యలో అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు పడకుండా ఉండాలి. ఇలాంటి ఎన్నో కష్టాలు పడితే గానీ రైతుకు పంట చేతికి రాదు.

“అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే రైతు మనకు తిండి పెట్టే దేవుడు” అంది అమ్మ.

అమ్మ చెప్పే మాటలతో నాకు మొదటిసారి అన్నం విలువ, రైతు విలువ తెలుసినట్లనిపించింది. తినే ఆహారాన్ని వృధా చేయకూడదని నిశ్చయించుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *