YSRCPకి ఎమ్మెల్యే గౌరు చరిత రాజీనామా.. త్వరలో టీడీపీలోకి

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన భరోసా జగన్‌లో కనిపించడం లేదు. టికెట్‌పై హామీ ఇచ్చి.. తర్వాత ఇవ్వడం కుదరదన్నారు. ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ మాట తప్పారు.. నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలి.

వైసీపీతో పాటూ ఎమ్మెల్యే పదవికి గౌరుచరిత రాజీనామా రెండు మూడు రోజుల్లో చంద్రబాబుతో సమావేశం ఈ నెల 9న టీడీపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం.

కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం అనుచరులు, కార్యకర్తల సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

పాణ్యం టికెట్ తమకే ఇవ్వాలని జగన్‌ను అడిగామని.. ముందు ఇస్తామని.. తర్వాత ఇవ్వడం కుదరదని చెప్పారంటున్నారు చరిత. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన భరోసా జగన్‌లో కనిపించడం లేదని.. గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ మాట తప్పారని.. తనకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

2014 ఎన్నికల్లో గౌరు చరితపై పోటీ చేసి ఓడిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చరిత, కాటసాని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తర్వాత టికెట్‌పై వైసీపీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో మనస్తాపంతో ఉన్నారు.

వారం రోజులుగా ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేతలు.. గౌరు దంపతులకు సర్థిచెప్పాలని చూసినా కుదరలేదు.

వైసీపీకి రాజీనామా చేసిన గౌరు దంపతులు.. త్వరలోనే చంద్రబాబును కలిసి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ నెల 9న పార్టీలో చేరబోతున్నట్లు అనుచరులు చెబుతున్నారు.

గౌరు దంపతులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు. 1999 ఎన్నికల్లో గౌరు వెంకటరెడ్డి వైఎస్‌ సూచనతో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు.

తర్వాత ఓ హత్య కేసులో జైలుకు వెళ్లడంతో.. 2004లో ఆయన సతీమణి గౌరు చరిత ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు.

వైఎస్‌ మరణం, జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడం, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి సమయంలో కూడా వైఎస్‌ కుటుంబానికి, జగన్‌కు మద్దతుగా నిలిచారు.

తర్వాత వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూ.. కర్నూలు జిల్లాలో కీలకమైన నేతలుగా ఎదిగారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలుపొందారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *