మామ ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచాడు. మమ్మల్ని పొడవడం పెద్ద పనా బాబుకి:ఎర్రబెల్లి

ఎన్టీఆర్ ను తొక్కిండు.. మమ్మల్ని అణగదొక్కిండు

ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడతా. బాబు బండారం బయటపెడతా… మొన్నటివరకు తలసాని చేసిన స్టేట్ మెంట్స్ ఇవి. బాబు చేసిన అరాచకాలు ఆంధ్ర ప్రజలకు తెలియాలంటారాయన.

ఇప్పుడీ లిస్ట్ లోకి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చేరారు. అవును.. ఆంధ్రా ప్రజలకు వాస్తవాలు తెలియాలంటున్నారు ఎర్రబెల్లి.

“మేం చంద్రబాబు ఉన్న పార్టీలోకి వెళ్లామా, లేక చంద్రబాబే మా పార్టీలోకి వచ్చాడా అనేది ఆలోచించాలి. నేను, కేసీఆర్ 1982 నుంచి టీడీపీలో ఉన్నాం. అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్. ఆ తర్వాత మా పార్టీలోకి చంద్రబాబు వచ్చారు.

మా కింద పనిచేశారు. వస్తూనే మమ్మల్ని వెల్లగొట్టే ప్రయత్నం చేశారు. మామ ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచాడు. మమ్మల్ని పొడవడం పెద్ద పనా. వచ్చిండు, ఎన్టీఆర్ ను తొక్కిండు, మమ్మల్ని అణగదొక్కిండు.”

ఆనాడు ఎన్టీఆర్, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే, ఈనాడు అదే కాంగ్రెస్ తో చంద్రబాబు సిగ్గులేకుండా పొత్తు పెట్టుకున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.

ఈ విషయాలన్నీ ఆంధ్రా ప్రజలకు తెలియాలన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే, ఆంధ్రాకు వెళ్లి బాబు గురించి ప్రజలకు వివరిస్తానంటున్నారు.

“ఆంధ్రా నుంచి తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు మస్త్ ఫోన్లు చేస్తున్నారు. మావాడు (చంద్రబాబు) బుద్ధి తక్కువ పని చేశాడని చెబుతున్నారు.

హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మేం చేసిన పెద్దతప్పు అని ఆయన వెంట ఉన్న మంత్రులు, టీడీపీ నాయకులు ఫోన్ చేసి బాధపడుతున్నారు.”

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించాలని సూచిస్తున్నారు ఎర్రబెల్లి.

ప్రజల మనసుల్లో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, మరికొన్నాళ్లు రాజకీయాల్లో ఉంటారని, లేదంటే రిటైర్మెంట్ తప్పదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *