కరోనా చికిత్స బిల్లు కొండంత.. బీమా కంపెనీ ఇచ్చింది గోరంత.. డిశ్చార్జ్ చేయని హాస్పిటల్

కరోనా పేషెంట్ల చికిత్స విషయంలో ప్రయివేట్ హాస్పిటళ్లు ప్రభుత్వ మాార్గదర్శకాలన పాటించడం లేదు. పీపీఈ కిట్లు, ఇతర ఖర్చులన్నీ కలపడంతో బిల్లు తడిచి మోపెడు అవుతోంది.

ప్రయివేట్ హాస్పిటళ్లలో కరోనా చికిత్సకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కారు.. వసూలు చేయాల్సిన ఫీజుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ప్రయివేట్ హాస్పిటళ్లు ఇష్టారీతిన ఫీజు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

పీపీఈ కిట్లు, ఎమర్జెన్సీ చికిత్స పేరిట భారీగా ఛార్జ్ చేస్తున్నాయని కథనాలు వెలువడుతున్నాయి.

కాగా హైదరాబాద్‌లోని హెల్త్ ఇన్సూరెన్స్ విషయమై కరోనా నుంచి కోలుకున్న వ్యక్తితో ఓ కార్పొరేట్ హాస్పిటల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

వివరాల్లోకి వెళ్తే మనోజ్ కొఠారి (47) అనే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో మనోజ్‌తోపాటు అతడి తల్లి, సోదరుడు హైదరాబాద్ నగరంలోని ఓ హాస్పిటల్‌లో చేరారు.

జూన్ 28 నాటికి ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో డిశ్చార్జ్ చేయాలని హాస్పిటల్ వర్గాలు నిర్ణయించాయి.

మనోజ్ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉండటంతో హాస్పిటల్ వర్గాలు ముందుగా డబ్బులు తీసుకోలేదు.

డిశ్చార్జ్ సమయంలో హాస్పిటల్ మనోజ్‌ రూ. 4.2 లక్షలు బిల్లు వేసింది. ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం రూ.1.23 లక్షల క్లెయిమ్‌‌నే అప్రూవ్ చేసింది.

కరోనా పేషెంట్ల చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 248 ప్రకారం ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నామని బీమా సంస్థ స్పష్టం చేసింది.

కానీ హాస్పిటల్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలు డబ్బులు కట్టి చేరే పేషెంట్లకు మాత్రమే వర్తిస్తాయని..

ఇన్సూరెన్స్ ఉన్నవారికి వర్తించవని వాదించింది. మిగతా మొత్తం చెల్లించే హాస్పిటల్ నుంచి వెళ్లాలని మనోజ్ కొఠారికి సూచించింది.

మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం ముగిసింది. శనివారం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా వైరస్ పేషెంట్ల చికిత్స ఖర్చు విషయంలో ప్రభుత్వ విధానంలో లోపం ఉందని మాజీ కార్పొరేటర్ అమ్జదుల్లా ఖాన్ తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటళ్లు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed