మెగాస్టార్ అడుగుజాడల్లో పవర్ స్టార్ ఒకటే స్థలం నుంచి పోటీ చేసే అవకాశం

ఉభయ గోదావరి జిల్లాల్లోంచే హేమాహేమీలు, బిగ్ షాట్ లు బరిలోకి దిగి ఎన్నికల్లో సరికొత్త జోష్ తెచ్చారు. రాబోయే ఎన్నికలు మరింత జోరుగా జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో రాబోయే ఎన్నికలు చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఊరువాడా కోడై కూస్తున్నాయి.

పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

పవన్ కళ్యాణ్పశ్చిమ గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తారంటూ వస్తున్న ప్రచారంతో ఎన్నికల సమరం మరింత కసిగా జరిగే అవకాశం కనిపిస్తోందని జిల్లా వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.

మెగా స్టార్ ఫ్యామిలీ సొంత జిల్లా పశ్చిమగోదావరి. చిరంజీవి సొంతఊరు ఈ జిల్లా లోని మొగల్తూరు. ఈ గ్రామం చిరంజీవి స్వస్థలం, ఆస్తులు, బంధుగణం అంతా ఇక్కడే ఉన్నారు. చిరంజీవి తాత పెనుగొండలో పోస్ట్ మేన్ గా పని చేసేవారు. ఆ తర్వాత ఆయన తండ్రి మెుగల్తూరులో కానిస్టేబుల్ గా పనిచేశారు.

అప్పట్లో చిరంజీవి కుటుంబానికి రెండెకరాలు ఆస్తి ఉండేది. అయితే చిరంజీవి సోదరీమణుల పెళ్లిళ్ల కోసం ఆభూమిని అమ్మేశారు…పశ్చిమగోదావరి జిల్లాతో ఇంతటి అనుబంధం ఉండటంతో ఈ జిల్లా నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని మెగాస్టార్ చిరంజీవి ఆశించారు.

తనకు జన్మనిచ్చిన తల్లి జిల్లా నుంచే రాజకీయ జీవితం ప్రారంభించాలని కలలు కన్నారు. 2009లో ప్రజారాజ్యం స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలు చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చాయి. చిరంజీవి ఓటమి చవిచూశారు.

ప్రజారాజ్యం పార్టీ నుండి పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి, టీడీపీ తరపున సి.హెచ్.సత్యనారాయణ పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణి, బీజేపీ నుంచి టి.ముసలయ్య, లోక్‌సత్తా నుంచి సూర్యనారాయణ పోటీచేశారు.

ఈ రణరంగ పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి ఘన విజయం సాధించారు. దీంతో బంగారు ఉషారాణి ఎవరా అంటూ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగింది.

అయితే ,ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందడం జరిగింది. చిరంజీవి ఓటమిని పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తలు, చిరు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

ఎక్కడ అయితే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లు నుంచే పవన్ కళ్యాణ్ ను బరిలోకి దించి గెలిపించుకోవాలని జనసేన పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు.

పాలకొల్లులో పోటీపై ఇటీవలే ఆ జిల్లా పార్టీ నేతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏలూరులోని పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ పేరుతో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న పార్టీ నేతలు పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. అదే అద్దె ఇంటి అడ్రస్ తో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు పొందారు కూడా.

దీంతో పవన్ కళ్యాణ్ పోటీ ఏలూరు నుంచే అంటూ ప్రచారం కూడా కొనసాగుతుంది. ప్రజాపోరాటయాత్రలో భాగంగా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుగా పవన్ కళ్యాణ్ తనకు ఇక్కడే ఉండాలనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

తన తాత పెనుగొండలో పోస్టుమేన్‌గా పనిచేశారని తన తండ్రి మొగల్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

తమకు మెగల్తూరులో రెండెకరాల భూమి ఉండేదని ఆ భూమిని ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తన తండ్రి అమ్మేసినట్లు చెప్పుకొచ్చారు.

ఆ భూమి ఉంటే ఇక్కడే ఉండిపోయేవాడినని…

తమ పూర్వీకులు ఇక్కడే నివసించినా తాను ఉన్నది తక్కువ అంటూ స్పష్టం చేశారు. చిన్నప్పుడు రెండు సార్లు మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు.

నరసాపురంలో ఒకసారి తప్పిపోయానని అప్పట్లో కానిస్టేబుల్‌ రక్షించి మా నాన్నకు అప్పగించారని గుర్తు చేసుకున్నారు.

మెుగల్తూరులో చెట్టెక్కి జామకాయలు కోసిన తీపి జ్ఞాపకం ఇప్పటికీ గుర్తుందంటూ చెప్పుకొచ్చారు.

తమ పూర్వీకుల మూలాలున్న ప్రాంతంగా ఈ జిల్లా అంటే ఎంతో అభిమానమన్న పవన్ ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుండెల్లో పదిలపరుచుకుంటూ అని తెలిపారు.

అంతేకాదు ఇక్కడ నుంచి వెళ్లాలనిపించడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో ఆసక్తి పెంచాయి.

అంతే స్థాయిలో కసిని కూడా పెంచాయి. పవన్ కళ్యాణ్ ను ఇక్కడ నుంచే పోటీ చేయించాలని పట్టుదలతో ఉన్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లేదా ఏలూరు నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి వేరే నియోజకవర్గం నుంచి కూడా పోటీ చెయ్యాలని సూచిస్తున్నారట.

అన్న మెగాస్టార్ చిరంజీవి సెంటిమెంట్ పవన్ కు ఎదురయ్యే అవకాశం ఉంటుందేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారట

అందువల్ల పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నుంచితోపాటు వెనుకబడిన జిల్లా నుంచి కూడా పోటీ చెయ్యాలని మరికొందరు సూచిస్తున్నారట.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాయలసీమలో వెనుకబడిన జిల్లా అయిన అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటకే ప్రకటించారు. అయితే అక్కడ పవన్ రాజకీయం చెల్లుతుందా అన్న చర్చజరుగుతోందట.

మరోవైపు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు

గతంలో ప్రజారాజ్యం పార్టీ అక్కడ నుంచే గెలిచిందని జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని పార్టీ కూడా బలంగా ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారట.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారట.
పవన్ పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చెయ్యాలని భావించకపోతే ఎందుకు తాను మీవాడినని, ఇదే తన సొంత జిల్లా, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందంటూ పవన్ వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏముంటుందంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా ప్రజల్లోనట. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమో అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు వేచి చూడాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *