డైలీ సీరియల్ లాగ కొనసాగే పంచాయితీలు సీట్లు.. ఏమీ తేల్చని చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్ల పంచాయితీల్లో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు.

అయితే ఎంత బిజీగా చర్చలు జరిపినా.. ఏదీ తెగడంలేదు! ఉదాహరణకు జమ్మలమడుగు పంచాయితీనే తీసుకుంటే.. ఇది రెండున్నరేళ్లకు పైనుంచినే కొనసాగుతూ ఉంది.

అప్పుడంటే ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా తెలుగుదేశం అధినేత ఎవరిని అక్కడ నుంచి పోటీ చేయించాలనే అంశం గురించి తేల్చలేకపోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా పంచాయితీ జరిగింది. 

కొన్నిరోజుల కిందట తేల్చేసినట్టుగా ప్రకటించారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ అని, ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ టికెట్ అని తేల్చారని అప్పట్లో ప్రకటించారు.

అయితే అలాంటి ప్రకటన చేశాకా కూడా.. నిన్న అర్ధరాత్రి వరకూ జమ్మలమడుగు పంచాయితీ కొనసాగడం విశేషం. మళ్లీ పాత కథే. ఆది, రామసుబ్బారెడ్డి ఇద్దరూ.. ఎమ్మెల్యే టికెట్ విషయంలో పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది.

వారు పట్టు బట్టడం సంగతలా ఉంచితే.. చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏమీ తేల్చలేకపోతున్నట్టుగా తెలుస్తోంది.

ఒక్క సీటు విషయంలోనే ఇంత పంచాయితీ అయితే.. ఇంకా ఇలాంటి పీటముడులు చాలా నియోజకవర్గాలోఉన్నాయి.

నిన్న అర్ధరాత్రి పన్నెండు వరకూ జమ్మలమడుగు విషయంలో పంచాయితీ కొనసాగినా ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు, ఎవరికి ఎంపీ టికెట్ అనే విషయాన్ని అధికారికంగా తేల్చలేకపోయారు.

ఏమీ తేలకుండానే పంచాయితీ ముగిసింది. డైలీ సీరియల్ లా ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేకపోవడంతోనే చంద్రబాబు ఈ సీటు విషయంలో ఇంతగా పంచాయితీ చేయాల్సి వస్తోందని సమాచారం.

ఇక కర్నూలు పంచాయితీ కూడా నిన్న జరిగింది. డోన్, పత్తికొండ సీట్లు తమకే కేటాయించాలని… కోట్ల కుటుంబం తెలుగుదేశంలోకి వచ్చినా తమకు అభ్యంతరం లేదని ఈ వర్గం అంటోంది.

అయితే చంద్రబాబు ఆ రెండు సీట్ల విషయంలో ఉపముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం లేదట. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. కోట్ల వర్గంతో కలిసి పనిచేయాలని అంటోందట.

టికెట్ ఇస్తే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని కేఈ అంటున్నారట. ఈ పంచాయితీ కూడా ఎటూ తేలలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *