ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా రాష్ట్రం దొంగల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించిన :చంద్రబాబు

అచ్చోసిన ఆంబోతుల సంఖ్య పెరిగిపోయింది.. వాటికి నేతగా జగన్’

డేటా చోరీ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజలకు తెలియకుండా వారి ఓట్ల తొలగింపునకు వైసీపీ ప్రయత్నిసోందని టీడీపీ ఆరోపిస్తోంది.

1.డేటా చోరీ వ్యవహారంపై ఏపీ, తెలంగాణ మధ్య మాటల యుద్ధం.
2.ఓట్ల తొలగింపునకు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున దరఖాస్తులు.
3.టీడీపీ సమాచారాన్ని వైసీపీకి టీఆర్ఎస్ ఇచ్చిందంటూ టీడీపీ ఆరోపణ.

ఎలక్షన్ మిషన్ 2019‌లో భాగంగా టీడీపీ నేతలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు కుట్రలో ఏ1 నిందితుడు వైసీపీ అధినేత జగనేనని మండిపడ్డారు. ఫామ్-7ను దుర్వినియోగం చేశామని జగన్ స్వయంగా ఒప్పుకోవడమే ఇందుకు సాక్ష్యమని, దుర్వినియోగం ఆ పార్టీకి సిగ్గుచేటని విమర్శించారు.

తప్పులు చేసేందుకు ఫామ్- 7ను వాడటం నేరమని, దీనిపై కేసు విచారణను జగన్ ఎదుర్కోక తప్పదని బాబు హెచ్చరించారు.

రాష్ట్రంలో ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఫారం- 7 దరఖాస్తులు 13 లక్షలు పంపుతారా అని వైసీపీని ప్రశ్నించిన చంద్రబాబు, బెంగళూరు,హైదరాబాద్ నుంచే ఈ కుట్రలకు తెరతీశారని ఆరోపించారు.

తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. 2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రం పరువు పోయిందని, ప్రస్తుతం దాన్ని తరమికొట్టి లేకుండా చేశామని చంద్రబాబు ఉద్ఘాటించారు.

తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్‌కు అలవాటుగా మారిపోయిందని, తప్పులు చేసేవాళ్లు, నేరగాళ్లకే వైసీపీలో చోటు దక్కుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

అంతేకాదు, రాష్ట్రంలో అచ్చోసిన ఆంబోతుల సంఖ్య పెరిగిపోయిందని, వాటిని ఎలా అణచాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఆ ఆంబోతులకు నాయకుడిగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇప్పటివరకూ 16 పార్లమెంట్ స్థానాలపై సమీక్ష పూర్తయిందని, మిగతా తొమ్మిది నియోజకవర్గాలకు సమావేశాలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా రాష్ట్రం దొంగల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించిన చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందునే రాష్ట్రానికి సమస్యలు పెరిగాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

అలాగే, త్వరలోనే 25 వేల మంది సేవామిత్రలతో భేటీ అవుతానని, వారందరికీ అవకాశాలు ఇచ్చి మంచి నేతలుగా తీర్చిదిద్దుతానని, ఆ బాధ్యతను స్వయంగా తానే మోస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *