టీచర్‌ను చంపిన ప్రేమోన్మాది ఆత్మహత్య…

రమ్య హత్యకేసు నిందితుడు రాజశేఖర్ విల్లుపురం జిల్లా తిరునావలూర్‌ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

టీచర్ రమ్యను తరగతిలోనే పాశవికంగా కత్తితో దాడిచేసి హత్యచేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విల్లుపురం జిల్లా తిరునావలూర్ అటవీ ప్రాంతంలో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులో సంచలనం సృష్టించిన ప్రైవేటు ఉపాధ్యాయురాలు రమ్య హత్య కేసు నిందితుడు రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో రమ్యపై కక్ష పెంచుకున్న రాజశేఖర్ శుక్రవారం ఆమె తరగతి గదిలో ఉన్న సమయంలో కత్తితో దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే.

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

కడలూరు జిల్లా కురింజిప్పాడికి చెందిన సుబ్రహ్మణ్యన్‌ కుమార్తె రమ్య (22) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసేది.

విరుదాచలం సమీపం విరుత్తగిరి కుప్పానికి చెందిన అరకంక్కనల్‌ కుమారుడు రాజశేఖర్‌ (23) ప్రైవేటు ఉద్యోగి.

రెండేళ్ల క్రితం రమ్య కడలూరులో ఉన్న ప్రైవేటు కళాశాలలో చదువుతున్నప్పుడు బస్సులో వెళ్లి వస్తుండేది. ఈ సమయంలో రమ్యను ప్రేమిస్తున్నానంటూ రాజశేఖర్‌ వెంట పడేవాడు. ఆమె నిరాకరించడంతో చాలాసార్లు గొడవపడ్డాడు.

పెళ్లి చేసుకుందామని ఎన్నిసార్లు అడుగుతున్నా రమ్య తిరస్కరిస్తుండటంతో ఆమెను చంపేయాలనుకున్నాడు.

పథకం ప్రకారం శుక్రవారం పాఠశాలకు వచ్చిన రాజశేఖర్ తరగతి గదిలో ఉన్న రమ్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన రమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై కురింజిప్పాడి పోలీసులు కేసును నమోదు చేసుకుని రాజశేఖర్‌ కోసం గాలింపు చేపట్టారు.

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సాయంతో అతడు విల్లుపురం జిల్లా తిరునావలూర్‌ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది.

దీంతో శనివారం ఎస్‌ఐ నటరాజన్‌, 50 మందికి పైగా పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలించారు.

రాజశేఖర్‌ కనిపించకపోవడంతో ఆదివారం ఉదయం కూడా గాలింపు చేపట్టారు. అదే సమయంలో విల్లుపురం జిల్లా ఉళుందూర్‌పేట వద్ద ఉన్న తొప్పుళాన్‌కుళం ముందిరికాట్టు అటవీ ప్రాంతంలో చెట్టుకు ఎవరో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తిరునావలూర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతుడిని రాజశేఖర్‌గా గుర్తించారు. సమీపంలో ఓ బైక్ కూడా గుర్తించారు. కురింజిప్పాడి ఇన్‌స్పెక్టరు రామదాసు రాజశేఖర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పట్టుకుంటారన్న భయంతోనే రాజశేఖర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *