49 ఏళ్ల తర్వాత పాక్ గగనతలంలోకి భారత యుద్ధ విమానం…

పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సైనికులను పొట్టనబొట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అదును చూసి వారి కీలక స్థావరంపై దాడిచేసింది.

భారత్, పాక్ యుద్ధం తర్వాత ఎల్‌ఓసీని దాటి వాయుసేన దాడి.
పాక్ గగనతలంలోకి దాదాపు 50 ఏళ్ల తర్వాత యుద్ధ విమానం.
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పిన భారత్.

పుల్వామా ఆత్మాహుతి దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ గగనతలంలోకి దూసుకెళ్లి దట్టమైన అటవీ ప్రదేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడులు చేసింది.

ఏం జరుగుతుందో పాక్ తెలుసుకునేసరికే మిరాజ్ యుద్ధ విమానాలు తమ పనిని పూర్తిచేసి వెనుదిరిగాయి.

వీటిని కూల్చడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది.

బాలాకోట్‌లోని లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్, జైష్మే మహ్మద్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిక్షణా శిబిరంపై తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 12 యుద్ధ విమానాలు దాడి చేశాయి.

బాలాకోట్, ముజఫరాబాద్, చికోటి స్థావరాలపై 1000 కిలోల బాంబులను జారవిడిచి పూర్తిగా ధ్వంసం చేశాయి.

ముజఫరాబాద్ సెక్టార్‌లో ఎల్‌ఓసీని అతిక్రమించి భారత వైమానిక దళ విమానం తమ భూభాగంలోకి ప్రవేశించినట్టు పాక్ సైన్యం ధ్రువీకరించింది. పుల్వామా ఉగ్రదాడితో భారత్ మరోసారి సర్జికల్ దాడులు చేస్తుందని పాక్ ఊహించింది.

గతంలో ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత 2016 సెప్టెంబరు 29న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

అయితే, ముందస్తుగా ఎల్ఓసీ వద్ద ఉన్న శిబిరాల నుంచి ఉగ్రవాదులను పాక్ తరలింపు చేపట్టింది. కానీ, భారత సైన్యం అనూహ్యంగా పాక్ భూభాగంలోకి 49 ఏళ్ల తర్వాత తొలిసారిగా చొచ్చుకెళ్లింది.

1971 పాక్ యుద్ధం తర్వాత భారత వాయుసేనకు చెందిన విమానం నియంత్రణ రేఖను దాటి ఆ దేశ గగనతలంలోకి వెళ్లడం ఇదే తొలిసారి.

కార్గిల్ యుద్ధ సమయలోనూ ఐఏఎఫ్ విమానాలు ఎల్ఓసీని దాటివెళ్లలేదు. మన భూభాగం నుంచే ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి.

ఇంతకు ముందు జరిగిన సర్జికల్ దాడులు, గతంలోనూ ఉగ్రవాదులపై జరిపిన దాడుల సమయంలోనూ నియంత్రణ రేఖను అధిగమించలేదు

వైమానిక దాడులతో అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోతాయని భావించి వెనకడుగు వేశారు.

కానీ, ప్రస్తుతం జరిగిన వైమానిక దాడిలో సాధారణ పౌరులకు ఎటువంటి హాని జరగకుండా, పాక్ సైన్యం కళ్లుగప్పి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా సమన్వయంతో దాడి చేసింది.

ఐఏఎఫ్‌కి చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. తాజా సర్జికల్ దాడిలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.

భారత్ ఇప్పటికే పాక్ సరిహద్దుల్లోని వైమానిక స్థావరాలైన జామ్‌నగర్; మాల్యా, అహ్మదాబాద్, వడోదరలో అప్రమత్తమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *