అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు

ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి ముకుందరావు, కొడుకు మురళి.

ముకుందరావుకి మూఢనమ్మకాలు ఎక్కువ. ప్రతి దాన్ని తాను గుడ్డిగా నమ్మడమే కాకుండా, ఇంట్లో అందర్నీ పాటించమని పేచీ పెట్టేవాడు.

తండ్రి ప్రవర్తన కొడుకు మురళికి పెద్ద తలనొప్పిగా తయారయింది. ముకుందరావు ఓసారి ఏదో ముఖ్యమైన పనిమీద బయలుదేరి ఇంటి నుండి బయటకొచ్చాడు.

అప్పుడే ఎదురుగా పిల్లి వచ్చింది. పిల్లిని తిట్టుకుంటూ ముకుందరావు తిరిగి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాడు. కొడుకు మురళి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.

అంతలో బయట పిల్లి అరుపు పెద్దగా వినపడింది. మురళి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూశాడు. అక్కడ ఓ కుక్క పిల్లిని నోట కరుచుకుపోవడం చూసి మురళి బాధపడ్డాడు. ముకుందరావు మళ్ళీ బయటికొచ్చి చూసి, పిల్లి లేదు హమ్మయ్య అనుకొని సంతృప్తిగా బయల్దేరాడు.”ఆగు నాన్న” అన్నాడు మురళి. ఏమిట్రా? అన్నాడు ముకుందరావు, కొడుకు ఎందుకు ఆపాడో అర్థం కాక.

దారిన వెళ్తున్నా పిల్లికి మీరు ఎదురు పడ్డారు. పెల్లిని మీరు చూశారు, మిమ్మల్ని పిల్లి చూసింది. దోషం పోవడానికి మీరు ఇంట్లోకి వెళ్ళి కాళ్ళుకున్నారు. కానీ ఈ విషయం పిల్లికి తెలియక ఆ పని చేయలేదు. అందుకే ఈ దోషం తగిలి, కుక్క నోట్లో పడి ప్రాణం పోగొట్టుకుంది. అని చనిపోయిన పిల్లి ని చూపించాడు మురళి. ముకుందరావుకి నోట్లో పచ్చి వెలక్యాయ పడ్డట్టయ్యింది. పిల్లిని చూసి బాధ కలిగినా, సమర్థించు కోవడానికి…..ఛ….ఛ… నా వల్ల దానికి దోషం ఎందుకు కలుగుతుంది. దానికి జాగ్రత్త లేకపోవడం వల్ల చనిపోయింది అన్నాడు.

ఇద్దరు ఎదురుపడ్డారు. మీ వల్ల దానికి దోషం కలగనప్పుడు, దానివల్ల మీకు దోషం ఎందుకు కలుగుతుంది? ఏదైనా జాగ్రత్త అజాగ్రత్త వల్లే మంచి, చెడులు జరుగుతాయని భావించవచ్చుగా. చెడు జరక్కుండా జాగ్రత్త పడొచ్చుగా. మీకీ మూఢనమ్మకాలు ఎందుకు? తండ్రిని ప్రశ్నించాడు మురళి. “నిజమేరా” అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు పాటించడం అజ్ఞానమే అవుతుంది.

ఇప్పటి నుండి ఏ మూఢనమ్మకాలూ పట్టించుకోను. జాగ్రత్తలు మాత్రమే పాటిస్తాను అని చనిపోయిన పిల్లివైపు జాలిగా చూశాడు. పిల్లి చనిపోయినందుకు మురళికి బాధ కలిగినా, తండ్రిలోని మూఢ నమ్మకాలు పిచ్చి వదలడం వల్ల చాలా ఆనందం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *