రైతుబంధు, వ్యవసాయంపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రైతుబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. వాళ్లకూ అందేలా ఆదేశం

రైతుబంధు, వ్యవసాయంపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత రెండు వారాల తర్వాత ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయన నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావడం విశేషం.

తెలంగాణలో రైతుబంధు డబ్బు అందని రైతులు ఎక్కడన్నా ఉంటే వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఈ వానాకాలం పంటలో ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తుండడం శుభ పరిణామమని అన్నారు.

రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుబంధు, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి

కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత రెండు వారాల తర్వాత ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయన నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావడం విశేషం.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నా ప్రభుత్వం రైతులకు రైతుబంధు సాయం విడుదల చేసింది.

ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు ఈ సాయం అందింది. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? లేదా అనేది గుర్తించాలి.

ఎవరైనా మిగిలిపోతే అందించే ఏర్పాట్లు చేయాలి. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదు.

చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికింది.’’ అని కేసీఆర్ అన్నారు.

‘‘రైతులు చర్చించుకోవడానికి, అధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.

దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలి. రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే వారికి రక్షణ వేదికలు అవుతాయి.’’

‘‘ రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి.

ఈ విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదలవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *