కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెడతారని..ఓ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది..

ముఖ్యమంత్రిగా కేటీఆర్‌కు పట్టాభిషేకం.. ఎందుకీ తొందర?

TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని ఓ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. గతంలో కేసీఆర్ ఇలాంటి ప్రచారాన్ని కొట్టిపారేశారు.

కరోనా వైరస్‌తో తెలంగాణ ప్రజానీకం బెంబేలెత్తుతున్న వేళ.. సీఎంగా కేటీఆర్‌కు త్వరలోనే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ ఓ దినపత్రికలో కథనం ప్రచురితమైంది.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెడతారని.. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని ‘ఆంధ్రప్రభ’ కథనం పేర్కొంది.

కేసీఆర్ పెట్టిన అన్ని పరీక్షల్లో కేటీఆర్ సక్సెస్ అయ్యారని.. గత ఆరేళ్లలో అద్భుతమైన పనితీరు కనబర్చారని కొనియాడింది.

వాస్తవానికి కరోనా టెస్టులు, చికిత్స విషయంలో తెలంగాణ సర్కారుపై ప్రజలు ఒకింత అసహనంతో ఉన్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని కొద్ది రోజుల క్రితం ఇంటెలిన్స్ రిపోర్టులు వచ్చాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇలాంటి తరుణంలో కేటీఆర్‌కు పట్టాభిషేకం చేస్తారంటూ వెలువడిన కథనం ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ.. బాధ్యతలన్నీ కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు.

అంతా తానై పనులు చక్కబెడుతున్నారు. భవిష్యత్తులో ఎప్పటికైనా కేటీఆరే సీఎం అనే భావన తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉంది.

అదీగాక జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్‌కు ఆసక్తి ఎక్కువ.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. 2019 ఎన్నికల్లోనే కుదిరితే జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. జగన్, మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి నేతలతో భేటీ అయిన కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులేశారు.

కానీ మోదీ హవా కారణంగా ఆ ఛాన్స్ లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల నాటికి మోదీ హవా తగ్గే అవకాశం ఉందని.. కాంగ్రెస్ కూడా అంతగా పుంజుకోదని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని భావించడానికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రం కరోనా నుంచి తేరుకోని ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పగ్గాలను కేటీఆర్‌కు అప్పగిస్తారని భావించలేం. ఇప్పటి పరిస్థితుల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి.

ప్రభుత్వాలపై ఎంతగా విమర్శలు గుప్పించినా.. పెద్దగా ఫలితం ఉండటం లేదు. కరోనా విజృంభణ వేళ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడతారని భావించలేదు.

ఈ ఏడాది చివర్లో బిహార్ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో బెంగాల్ ఎన్నికలుంటాయి.

అప్పటి వరకూ వేచి చూసి.. పరిస్థితులపై అవగాహన వచ్చాక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరగ్గా.. కేసీఆర్ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *