పాక్‌తో టీమిండియా ఆడదు : రాజీవ్‌ శుక్లా

కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశం లేదని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు.
రానున్న ప్రపంచ కప్‌లో భారత్‌-పాక్‌ మధ్య జరగాల్సిన మ్యాచుల గురించి తాను ఇప్పట్లో ఏ విషయమూ చెప్పలేనని వ్యాఖ్యానించారు.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘భారత్-పాక్‌ ధైపాక్షిక మ్యాచులపై మా తీరు స్పష్టంగా ఉంది.

ప్రభుత్వం ఒప్పుకునే వరకు పాక్‌తో టీమిండియా ఆడదు. అన్ని అంశాలకు అతీతంగానే క్రీడాస్ఫూర్తి ఉండాలి. కానీ, ఒకరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపైన కూడా పడుతుంది’ అని వ్యాఖ్యానించారు.

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడే అవకాశాలు ఉన్నాయా? అన్న అంశంపై రాజీవ్‌ శుక్లా స్పందిస్తూ… ‘ఈ విషయంపై మేము ఇప్పట్లో ఏమీ చెప్పలేము. ప్రపంచ కప్‌కు చాలా సమయం ఉంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఉగ్రదాడిపై భారత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాక్‌ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి. వారు ఉగ్రవాదానికి మద్దతు తెలపొద్దు. మొదటి నుంచి మనం ఇదే విషయాన్ని చెబుతున్నాము. పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న విషయంపై మన వద్ద అనేక ఆధారాలున్నాయి’ అని తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రపంచ కప్‌లోనూ పాక్‌తో భారత్ ఆడొద్దని డిమాండ్‌ వస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *