న్యాయ పోరాటానికి సమయం వచ్చేసింది..జనసేన టెలీకాన్ఫరెన్స్‌లో కీలక నిర్ణయం

ఏపీలో మూడు రాజధానులపై న్యాయ పోరాటం చేసేందుకు సమయం వచ్చేసిందని జనసేన నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి ప్రజామోదం కనిపించడంలేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజధానుల విషయంపై జనసేన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఈ సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్, పీఎసీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం హెచ్‌ఎస్‌ఎల్ ప్రమాదంలో మృతి చెందిన వారికి జనసేన నేతలు సంతాపం తెలిపారు.
రాజధాని వికేంద్రీకరణపై ఇక న్యాయ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని జనసేన నేతలు పేర్కొన్నారు.
ప్రజలు ఉద్యమించకుండా కోవిడ్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
వేల ఎకరాలను అమరావతి రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రభుత్వం మారగానే రాజధాని మారితే ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పోతుందని జనసేన పార్టీ పేర్కొంది.
ఈ సందర్భంగా జనసేన నేత, నటుడు నాగబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారని పేర్కొన్నారు.
ఇకపై ప్రభుత్వాలు భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములిస్తారని నిలదీశారు.
రాజధాని విషయంలో తొలి నుంచి జనసేన ఒకే విధానంతో ఉందని స్పష్టం చేశారు.
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాజధాని తరలింపు ప్రభుత్వ నిర్ణయం కాదని.. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమని విమర్శించారు.
రాజధాని అమరావతిలో భూ కుంభకోణాలు జరిగాయని వైసీపీ చెబుతోందని, ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే విచారించి శిక్షించాలి కదా అని ప్రశ్నించారు.
రాజధానిలో పవన్ పర్యటించి నిర్మాణాలు పరిశీలించారన్నారు. రైతులు నష్టపోకూడదని మొదట్నుంచీ పవన్ చెబుతున్నారని మనోహర్ తెలిపారు.