నైపుణ్యం విభాగంలో 60-70 ఉద్యోగాలను స్థానికులకే…58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్.. అనూహ్య నిర్ణయం వెనుక అసలు కారణాలు ఇవేేనా..?

తెలంగాణలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగావకాశాలు కల్పించేలా నూతన విధానానికి కేసీఆర్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన సచివాలయ డిజైన్‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. సచివాలయ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భాగ్యనగరానికి నలుమూలలా పారిశ్రామిక గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

నియంత్రిత పంటలసాగు, టీఎస్ బిల్డింగ్ పాస్ లాంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో తీసుకున్న అత్యంత ఆసక్తికరమైన, కీలక నిర్ణయం ఉద్యోగాల్లో స్థానికులకు పెద్ద పీట వేయడం.

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే లభించేలా నూతన విధానానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానికులను ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకునే ఇండస్ట్రీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది.

రెండు కేటగిరీలుగా పరిశ్రమలు

తెలంగాణ యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇందుకోసం పరిశ్రమలను రెండు కేటగిరీలుగా విభజించింది. మొదటి కెటగిరీలోకి వచ్చే పరిశ్రమల్లో.. నైపుణ్యం గల మానవ వనరుల్లో స్థానికులు కచ్చితంగా 50 శాతం ఉండాలి.

ఇలాంటి పరిశ్రమల్లో పాక్షిక నైపుణ్యం విభాగంలో 60-70 ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలి. రెండో విభాగం పరిధిలోకి వచ్చే పరిశ్రమల్లో స్కిల్డ్ వర్కర్లలో 60 శాతం మంది స్థానికులు, సెమీ స్కిల్డ్ వర్కర్లలో 80 శాతం మంది స్థానికులు ఉండాలని పేర్కొంది.

కేటీఆర్ ఆధ్వర్యంలో ముసాయిదా రూపకల్పన

రాష్ట్రానికి వస్తోన్న పరిశ్రమల్లో ఎక్కువ శాతం ఉద్యోగావకాశాలు స్థానిక యువతకే దక్కేలా పాలసీని రూపొందించాలని ఇటీవలే పరిశ్రమల శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

దీంతో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ పాలసీని రూపొందించింది. దీనిపై చర్చించిన కేబినెట్.. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆమోదం తెలిపింది.

అటు పరిశ్రమలను మరీ ఇబ్బంది పెట్టకుండా.. ఇటు స్థానిక యువతను దృష్టిలో ఉంచుకొని ఈ ముసాయిదాను రూపొందించారని భావించొచ్చు.

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా..

నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే కారణంతోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది.

రాష్ట్ర ఏర్పాటులో యువత పోషించిన పాత్ర ఎనలేనిది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, తమ బిడ్డకు నౌకరీ వస్తుందని తల్లిదండ్రులు ఆశించారు. కానీ తెలంగాణ వచ్చాక 50 వేలకు పైగా ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగలిగారు.

ప్రభుత్వ విభాగంలోనే మరో లక్షకుపైగా ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేకపోతోంది.

లాక్‌డౌన్ కారణంగా ప్రయివేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగాల్లో కోత పడింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో వారికి ఊరటనిచ్చేలా.. ఈ విధానాన్ని రూపొందించారు.

ఉద్యోగుల పదవీ విరణమ పెంపు హామీ..

మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిన ఆ హామీ అమలు కాలేదు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవాలని భావించినప్పటికీ.. కరోనా దెబ్బ కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడింది.

ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో.. ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఈ కేబినెట్ భేటీలో రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై చర్చిస్తారని.. వీలైతే ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే యువతలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉండటంతో.. ముందుగా వారిని సంతోషపెట్టేలా ఉద్యోగాల్లో స్థానికులకు పెద్ద పీట వేసేలా నిర్ణయం తీసుకున్నారు.


సర్కారుకు ఆదా..

రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల తెలంగాణ సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఇప్పటికిప్పుడు రిటైర్ అయ్యే వాళ్లు మరో రెండేళ్లు సర్వీసులో ఉంటారు.

దీని వల్ల వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడంతోపాటు.. వారికి ఇచ్చే గ్రాట్యూటీ, ఇతర అలవెన్సులు ఇచ్చే అవసరం తప్పుతుంది.

ఈ మూడేళ్లలో 26 వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వీరు మరో రెండేళ్లు సర్వీసులో కొనసాగితే.. ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగులుతాయి.

ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాగో లేకపోవడంతో.. సిబ్బందిపై పని భారం కూడా తగ్గుతుంది.

ఏడాది క్రితం జగన్.. ఇప్పుడు కేసీఆర్

ఏపీలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం తరహాలోనే తెలంగాణ సర్కారు నిర్ణయం ఉంది. కానీ తమ రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది ఆచరణ సాధ్యమేనా?

అనే ప్రశ్నలు తలెత్తినప్పటికీ.. ఈ నిర్ణయం ప్రభావం తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికలు వచ్చినప్పటికీ జగన్ వెనక్కి తగ్గలేదు.

మరీ 75 శాతం అంటే పరిశ్రమలు తటపటాయించే పరిస్థితి ఉండటంతో.. కేసీఆర్ సర్కారు ఒకింత ఆచితూచి వ్యవహరించింది.

పరిశ్రమలను రెండు కేటగిరీలుగా విభజించి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనే విభాగాల వారీగా స్థానికులకు తీసునేలా పాలసీని రూపొందించింది.

మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు కూడా స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకే రాయితీలను వర్తింపజేస్తామనే నిబంధనను విధించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *