పాలమూరు జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు…

పాలమూరుకు కర్ణాటక నీరు.. సీఎం కుమారస్వామికి కేసీఆర్ థ్యాంక్స్
కర్ణాటక సీఎం కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ థాంక్స్ చెప్పారు. పాలమూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చడానికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ అభ్యర్థనను మన్నించింది.

పాలమూరు జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. మండు వేసవిలో మహబూబ్‌నగర్ వాసులకు మంచినీటి కొరత నుంచి ఊరట కల్పించే ప్రకటన చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడామని..

నీటిని విడుదల చేయడానికి వారు అంగీకరించారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దౌత్యం ఫలించి.. పాలమూరు జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.

ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిశాయి. దీనికి తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి.

అంతేకాకుండా యాసంగి పంట కాలంలో వర్షాభావం ప్రభావంతో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా తగ్గిపోయాయి.

దీంతో పాలమూరు వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎండల తీవ్రత పెరిగితే మరింత ప్రమాదమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నీరు విడుదల చేయాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్‌కు తెలిపారు. శుక్రవారం (మే 3) రాత్రి నుంచే జూరాల ప్రాజెక్టుకు నీటి సరఫరా ప్రారంభం కానుంది.

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరఫున కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *