ఏపీకి రూ. 8 వేల కోట్లు ఇచ్చాం..కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి రూ. 8 వేల కోట్లు ఇచ్చాం.. ఆ మాట విని ఆశ్చర్యపోయా.. కేంద్ర ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము చేపట్టిన అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
భారతీయ జనతా పార్టీ మూడో వర్చువల్ ర్యాలీలో ఆమె మాట్లాడారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 10 కోట్ల మంది రైతులకు రూ. 72 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు.
ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో బీజేపీకి తెలుసని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలుగా చేయూత అందిస్తున్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు. కోవిడ్ ఫైట్ కింద ఏపీకి రూ.8,025 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ సంస్థల పనుల్లో ఒప్పందాలు ఉల్లంఘించకూడదని హితవుపలికారు.
ఇష్టం వచ్చినట్లు చేయడం వల్ల ప్రాజెక్టుల్లో అనేక ఇబ్బందులు వస్తాయని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.
కేంద్రం ఒక స్థాయిలో రూ.2.7కి విద్యుత్తు ఇస్తుంటే.. ఏపీలో రూ. 9 చార్జి చేయడం విని ఆశ్చర్యపోయానని నిర్మలా సీతారామన్ తెలిపారు. యూనిట్ విద్యుత్‌కు రూ. 9 ఇచ్చి పరిశ్రమల నిర్వహణ సాధ్యమేనా అనేది ఆలోచించాలని నిర్మలా అన్నారు.
అలాగే ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక నిధులు మంజూరు చేశారన్నారు. స్థూల దేశీయ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ తొమ్మిదో ర్యాంకులో ఉందని.. ఏపీలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలది ప్రముఖ స్థానమన్నారు.
అలాగే దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో ఏపీది మూడో ర్యాంకు అన్నారు. ఏపీలోని 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.936 కోట్లు వేసినట్లు వెల్లడించారు. ఏపీలోని 546 మత్స్యాకార గ్రామాల్లో 349 పిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. ఏపీలోని ఆక్వా, మెరైన్ ఫిషింగ్‌కు రూ. 11 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
ఎంత ఉపయోగించుకుంటారనేది రాష్ట్రానికే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మత్స్య సంపద యోజన కింద ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.