అటు జేడీఎస్ కు, ఇటు కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నారు: నటి సుమలత

రెండు పార్టీలకు చెమటలు పట్టిస్తున్న నటి!
అటు జేడీఎస్ కు, ఇటు కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నారు నటి సుమలత.
మండ్య నుంచి తను పోటీచేయడం ఖాయమని స్పష్టత ఇచ్చిన దివంగత నటుడు అంబరీష్ భార్య విషయంలో జేడీఎస్ తీవ్రమైన అసహనంతో ఉంది.
ఆమెను అనరాని మాటలు అని.. తమ కసిని తీర్చుకున్నారు జేడీఎస్ నేతలు. వారు ఆ మాటలు మాట్లాడటమే సుమలత విషయంలో వారు ఎంత భయపడుతూ ఉన్నారో స్పష్టం అయ్యేలా చేస్తోంది.
అక్కడ నుంచి జేడీఎస్ ముఖ్యనేత, కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేయాలని అనుకుంటున్నాడు. సుమలత పోటీచేస్తే నిఖిల్ కు అవకాశాలు మూసుకుపోతాయి.
మండ్య ప్రాంతంలో వక్కలిగల జనాభా గట్టిగా ఉంది. ఆ సామాజికవర్గంపై అంబరీష్ కు గట్టిపట్టుంది. అలాంటి అంబరీష్ భార్య ఈ తరుణంలో నామినేషన్ వేస్తే.. వారి ఓట్లు అటు వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువ. సానుభూతి బలంగా ఉంటుంది.
జేడీఎస్ ఆశలన్నీ అదే సామాజికవర్గం ఓట్ల మీద ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. సుమలత అక్కడ జేడీఎస్ ను టెన్షన్ పెడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సుమలత వైపు మొగ్గు కనిపిస్తూ ఉంది.
ఈ సీట్లో కాంగ్రెస్ పోటీచేయడం లేదు. పొత్తులో భాగంగా జేడీఎస్ కు ఈ సీటు ఇచ్చినట్టుగా ప్రకటించుకుంది. దీంతో సహజంగానే కాంగ్రెస్ లో అసహనం ఉంది.
అలాంటి వారు ఇప్పుడు తాము సుమలతకు మద్దతు అని అంటున్నారు. దీంతో ఆ పార్టీలో ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ అవకాశాలను బీజేపీ సానుకూలంగా మార్చుకుంటోంది.
వీలైతే సుమలతను తమ పార్టీ తరఫున పోటీ చేయించడం లేదా, ఆమె ఇండిపెండెంట్ గా పోటీచేస్తే సపోర్ట్ చేయడం.. అనే లెక్కతో ఉంది కమలం పార్టీ.
ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ సపోర్ట్ చేసేలా ఉంది. ఈ పరిణామాలు ఆసక్తిదాయకంగా మారింది. అసలు విషయాన్ని పద్దెనిమిదో తేదీన ప్రకటించబోతున్నట్టుగా సుమలత ప్రకటించారు.
ఏదేమైనా కర్ణాటకలోని అధికార పార్టీలకు సుమలత ముచ్చెమటలు పట్టిస్తున్నారు.