చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ల సభను పరిశీలించండి. జగన్‌లో ఆత్మవిశ్వాసం – బాబులో తెలియని భయం*

ఏపీలో ఎన్నికల ప్రచారం గమనించారా? అందులోను ఒకే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ల సభను పరిశీలించండి.

తూర్పుగోదావరి జిల్లా తునిలో చంద్రబాబు సభ జరుగుతుంటే, అదే సమయంలో ప్రకాశంజిల్లా గిద్దలూరులో జగన్‌ సభ జరుగుతున్నప్పుడు, చూసినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు కనిపించాయి.

చంద్రబాబు సభకు చలువ పందిళ్లు, కర్చీలు వేసి ప్రజలను కూర్చోబెట్టారు. పైన వేదిక మీద చల్లటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు జగన్‌ సభ మిట్ట మధ్యాహ్నం ఎర్రని మండుటెండలో జరిగింది.

తునిలో టీడీపీ సభలో చంద్రబాబు ప్రసంగం వింటున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు నిర్వేదంగా కూర్చున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో ఎన్నికల సమయంలో ఉండవలసిన జోష్‌ కనిపించలేదు.

చంద్రబాబు తన ప్రసంగంలో ఒకటికి రెండుసార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, కొద్దిమంది తప్ప మిగిలినవారంతా చోద్యం చూస్తున్నట్లు కూర్చుని కనిపించారు.

దాంతో చంద్రబాబే ప్రజలకు దాహం అవుతున్నట్లు అవుతుందని, అయినా నినాదం ఇవ్వాలని అంటూ పదే, పదే విజ్ఞప్తిచేశారు. మరోవైపు జగన్‌ ఆ ఎండలో ఉపన్యాసం చెబుతుంటే ఎదురుగా కనిపించినంత దూరం అంతా జనమే జనం.

ఎండను వారు ఖాతరు చేయకుండా ఉండడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అంతేకాదు జగన్‌ చెప్పిన ప్రతి అంశంపై పెద్దఎత్తున స్పందిస్తున్న తీరు వారిలో ఉత్సాహం, జోష్‌ కనిపిస్తాయి.

బాబులో తెలియని భయం

చంద్రబాబు తన ప్రసంగాలలో అత్యధిక భాగం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ను విమర్శించడానికి, ప్రధాని మోడీని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించడానికి కేటాయించారు.

కాగా జగన్‌ మాత్రం తన ఎజెండాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు అబద్ధాలు, మోసాలు నమ్మవద్దని, మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు చేస్తున్నారని ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తూ తాను అధికారంలోకి వస్తే ఏమి చేయదలిచింది చెబుతూ వస్తున్నారు.

ఎక్కడా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. చెడిపోయిన వ్యవస్థలో మార్పురావాలని, మాటఇస్తే అమలు చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లేలా రాజకీయ నేతలు ఉండాలని చెప్పారు.

చంద్రబాబు నాయుడు తుని సభలో ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అంటూ వేదికపై ఆయాచోట్ల వంగి, వంగి నమస్కారాలు చేయడం ఆయన ఎన్నికల ప్రచారంలో ఒక విచిత్రమైన పోకడే.

గత మూడు దశాబ్ధాలుగా ఎన్నికల ప్రచారంలో ఆయన అంతగా వంగి నమస్కారం పెట్టిన సందర్భం ఉన్నట్లు గుర్తులేదు. దీనిని బట్టి ఈసారి ఆయన ఎంతటి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్నారన్నది అర్ధం చేసుకోవచ్చు.

ఓటమి భయం ఆయనను వెన్నాడుతోందన్న అభిప్రాయం కలుగుతుంది. మరోవైపు జగన్‌ చివరిగా తన సభకు వచ్చిన ప్రజలకు హుందాగా రెండుచేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ముగిస్తున్నారు.

జగన్‌లో ఆత్మవిశ్వాసం

స్థూలంగా చూస్తే జగన్‌ సభలలో కాని, ఆయన ప్రసంగాలలో కాని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంటే, చంద్రబాబు సభలలో ఆయనలోని తెలియని భయం ఆవరించిందా అన్నభావన ఏర్పడుతుంది.

జగన్‌కు ఎండలో తరలివస్తున్న సందర్భం మాత్రం కచ్చితంగా పరిశీలించదగిందే. గతంలో ఒకప్పుడు ఇంధిరాగాందీ, ఆ తర్వాత ఎన్‌టీఆర్‌లకు ఇలా జనం తరలివచ్చి సభలలో పాల్గొనేవారు.

కాని ఇప్పుడు వారిద్దరికి ధీటుగా, లేదా అంతకన్నా మిన్నగా జగన్‌ వెళ్లిన ప్రతిచోట వేలసంఖ్యలో జనం రావడం, స్పందించడం మాత్రం వర్తమాన రాజకీయాలలో ఒక ఫినామినాగా కనిపిస్తుంది.

జగన్‌ ఇంకా ముఖ్యమంత్రి కాకుండానే ఈరకంగా జనాన్ని ఆకట్టుకోవడం ఒకచరిత్ర అయితే, చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో ఏ ముఖ్యమంత్రి దిగజారనంతగా స్థాయిని మరచి, ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి మాట్లాడుతున్నారు.

రాజకీయాలలో గెలవవచ్చు.. ఓడవచ్చు.. కాని చరిత్రలో ఫలానా వాళ్ల వల్ల రాజకీయాలకు గౌరవం వచ్చిందన్న భావన కలగాలి.

కాని చంద్రబాబు ఆ విలువలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా సభలకు ప్రజలను కొంతమేర ఆకట్టుకునేయత్నం చేస్తున్నా, జగన్‌తో పోల్చితే బాగా తక్కువే అనిపిస్తుంది.

ఆయన సినిమా గ్లామర్‌ ఆయనకు కొంత ఉపయోగపడుతోంది. కాని రాజకీయంగా దానిని ఆయన వాడుకోలేకపోతన్నారు.

దానికి కారణం ఆయన అధికార తెలుగుదేశం పార్టీపై పదునైన విమర్శలు చేయడంలో విఫలం అవుతున్నారు.

దానికితోడు టీడీపీతో ఏదో మ్యాచ్‌ పిక్సింగ్‌ ఉందన్న భావన ప్రబలడం ఆయనకు నష్టం చేస్తోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తున్న మరో ఇద్దరు స్టార్లు విజయమ్మ, షర్మిలలు కూడా ఎండా, నీడ అని చూడకుండా ప్రచారం చేస్తున్నారు.

షర్మిలమ్మ మాటలు సూటిగా స్పష్టంగా, ప్రజలను ప్రేరేపించడం ద్వారా ఆకట్టుకోగలుగుతున్నారనిపిస్తుంది.

ఇక టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్‌ ఆయా జిల్లాల్లో కొన్ని సభలలో పాల్గొన్నా అంత ప్రభావం చూపించలేకపోయారు.

ఏది ఏమైనా జనమే కొలమానం అయితే, జన స్పందనే అంచనాకు ప్రమాణం అయితే జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకన్నా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కన్నా బాగా ముందంజలో ఉన్నారని చెప్పకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *