ఏపీకి సహకరిస్తామని జగన్‌కు హామీ ఇచ్చా: తెలుగులో మోదీ…

ఏపీకి సహకరిస్తామని జగన్‌కు హామీ ఇచ్చా: తెలుగులో మోదీ
ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మోదీని కలిసిన జగన్‌ బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు.

1.ప్రధాని మోదీతో భేటీ అయిన వైఎస్ జగన్.
2.రాష్ట్ర సమస్యలపై చర్చ.
3.తన ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించిన జగన్.

ఢిల్లీ పర్యటనలో ఉన్న వైసీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన జగన్ నేరుగా మోదీ నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు.

వరుసగా రెండోసారి ప్రధాని పీఠంపై కూర్చోనున్న మోదీకి జగన్ పుష్ఫగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పగా.. మోదీని ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత జగన్, మోదీ సుమారు గంటసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులను మోదీకి వివరించిన జగన్.. రాష్ట్రానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.

విభజన సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మోదీని కలిసిన జగన్‌ బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు.

రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు.

మోదీతో భేటీ తర్వాత జగన్ ఏపీ భవన్‌కు బయలుదేరి వెళ్లారు.

ఏపీకి సహకరిస్తాం: మోదీ
జగన్‌తో భేటీ తర్వాత మోదీ తన తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వైఎస్ జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను.’ అని మోదీ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *