ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు…

ఆ రెండు పార్టీలు ఏపీకి వెన్నుపోటు పొడిచాయి: వైఎస్ జగన్

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ప్రత్యేక హోదానే ఏపీకి ప్రధాన అంశమని వెల్లడించారు.

జాతీయ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీది తటస్థ వైఖరి అని ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

ఏపీకి హోదా ఇచ్చేవారికే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడించారు.

ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్‌ మాట్లాడారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

రాష్ట్ర రాజకీయాలు, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

‘రానున్న లోక్ సభ ఎన్నికల తర్వాత మోదీ వచ్చినా, రాహుల్ వచ్చినా, మాయావతి వచ్చినా.. ఎవరొచ్చినా ఏపీకి హోదా ఇచ్చేవారికే మా మద్దతు.

మాకు రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ ప్రజల ఆకాంక్షలే ముఖ్యం. ప్రత్యేక హోదా మాకు అత్యంత ముఖ్యం. వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతిస్తాం’ అని జగన్ స్పష్టం చేశారు.

తన తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణమంతా ప్రజల మధ్యలోనే గడిచిందని వైఎస్ జగన్ తెలిపారు.

‘ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా.. ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచా. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్నా.

పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలోనే ఉన్నా. పాదయాత్ర పొడుగునా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చా. అన్ని వర్గాల వారి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం’ అని జగన్ అన్నారు.

ఆ రెండు పార్టీలూ ఏపీకి వెన్నుపోటు..

జాతీయ స్థాయిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలూ ఏపీని మోసం చేశాయని జగన్ అన్నారు. ఏపీ ప్రజలను కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయన్నారు.

ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు.

‘ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏపీని విభజించారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ ఒక్కటై పార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించాయి. పార్లమెంటు ద్వారాలు మూసేసి, లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి విభజన బిల్లును నెగ్గించుకున్నారు.

విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోవడంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఏపీలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి?’ అని జగన్ ప్రశ్నించారు.

‘విభజన తర్వాత చుట్టూ ఉన్న పెద్ద నగరాలతో ఏపీ ఎలా పోటీ పడుతుంది? హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో మేం ఏ రకంగా పోటీపడతాం? కేంద్రం హోదా ఇచ్చి.. 100 శాతం పన్ను రాయితీలు కల్పిస్తేనే.. ఇతర నగరాలతో పోటీపడి అభివృద్ధి సాధించగలం.

హైదరాబాద్‌లో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అలాంటప్పుడు కొత్తగా ఓ పరిశ్రమ, ఆస్పత్రి, ఫ్యాక్టరీ ఏపీలో ఎలా పెడతారు? ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ నిలబడగలదు’ అని జగన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *