సర్వమత ప్రార్థనల నడుమ కొత్తింట్లోకి జగన్‌ దంపతులు

అమరావతిలో వైసీపీ అధినేత నిర్మించిన కొత్తింట్లో ప్రవేశానికి ఫిబ్రవరి 14నే ముహూర్తం కుదిరినా, కుటుంబ సభ్యుల స్వల్ప అనారోగ్యంతో గృహప్రవేశం వాయిదా వేసినట్టు ప్రకటించారు.

అమరావతిలో జగన్ గృహప్రవేశం

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు.

సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు కొత్తింట్లో అడుగుపెట్టారు.

ఈ కార్యక్రమానికి జగన్ తల్లి వైఎస్‌ విజయలక్ష్మీ, సోదరి షర్మిల, అనిల్‌ దంపతులు హాజరయ్యారు. అలాగే, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వైసీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని కూడా జగన్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి వైసీపీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు.

వాస్తవానికి ఫిబ్రవరి 14నే ఈ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. అయితే, షర్మిల దంపతులు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నందున గృహప్రవేశం వాయిదా వేసినట్టు ప్రకటించారు.

అనంతరం జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంతో తిరిగి రెండు రోజుల కిందట ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసి, ఫిబ్రవరి 27గా నిర్ణయించారు.

అంతకు ముందు జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. జగన్ గృహప్రవేశంలో కేసీఆర్ పాల్గొంటారని ప్రచారం కూడా జరిగింది

సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో రూపుదిద్దుకున్నాయి. విభజన అనంతరం సీఎం చంద్రబాబు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకోగా, జనసేన అధినేత పవన్ సైతం ఇల్లు, కార్యాలయం ఒకేచోట నిర్మించుకున్నారు.

తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కూడా తన నివాసాన్ని రాజధాని పరిధిలో ఏర్పాటు చేసుకున్నారు.

దీంతో ఇక నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ అమరావతి కేంద్రంగా నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *