వైసీపీ అంచనాలు నిజమయ్యే దిశలో

అధికార తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంటోంది. ‘రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతోంది..’ అంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పార్టీలో హీట్‌ పెంచేస్తోంటే..

టిక్కెట్ల కోసం తెలుగు తమ్ముళ్ళు తన్నుకోకుండా వుంటారా.? ‘ఆశావహులు’ కొందరు, ‘అవకాశవాదులు’ కొందరు, అత్యుత్సాహంతో మరికొందరు.. వెరసి తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యిగా తయారవుతున్నారు.

టీడీపీలో వుంటే గెలవలేమని భావిస్తున్న కొందరు, పార్టీ మారేందుకు సిద్ధమవుతూనే ఇంకోపక్క పార్టీలో కుంపటి రాజేస్తున్నారు. మొన్నటికి మొన్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ‘పార్టీ మారుతున్నా..’ అంటూ లీకులు పంపి, ‘అబ్బే అంతా ఉత్తదే..’ అని ఖండించేశారు. ఇప్పుడాయన టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు, వైఎస్సార్సీపీలో చేరిపోయారు.

మరోపక్క, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, కర్నూలుజిల్లా రాజకీయాల్లో చేస్తోన్న లొల్లి అంతా ఇంతాకాదు. టీజీ దెబ్బకి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గల్లంతయ్యేలా వుంది. తన కుమారుడికి టిక్కెట్‌ ఇప్పించుకునేందుకు టీజీ నానా హైరానా పడ్తున్నారు.

ఈ క్రమంలో లోకేష్‌ ప్రకటననీ ఆయన లెక్క చేయడంలేదు. చంద్రబాబుతో పంచాయితీకి సిద్ధమైన టీజీ, తన కుమారుడికి టిక్కెట్‌ దక్కకపోతే పార్టీ మారేందుకూ వెనుకాడబోరట.

ఇటీవలే వైఎస్సార్సీపీ నేత విశ్వరూప్‌, అధికార టీడీపీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆరుగురు ఎంపీలు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీని వీడటానికి సిద్ధంగా వున్నారన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలైన విజయసాయిరెడ్డి తదితరులూ ఇదేతరహా అభిప్రాయాల్ని వ్యక్తంచేస్తున్నారు.

అందుకు తగ్గట్టే పరిస్థితులూ మారిపోతున్నాయి. ఎంపీ అవంతి శ్రీనివాస్‌,
ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి, వైసీపీ గూటికి చేరుకున్నారు. తాజాగా అమలాపురం ఎంపీ టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు.

వైఎస్‌ జగన్‌ నిన్న బీసీ డిక్లరేషన్‌ విడుదల చేయడంతో వలసల వేగం మరింత పెరుగుతందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. అయితే అలా వచ్చే అందరికీ వైసీపీ అకామడేట్‌ చేయగలదా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

వచ్చేవారిలో ఎంతమంది కోవర్టులున్నారో ‘చెక్‌’ చేసుకోవాల్సిన బాధ్యత, వారిని తీసుకొస్తున్నవారిపైనా, పార్టీ అగ్రనాయకత్వంపైనా వుంది. ‘కోవర్టు’ ఆపరేషన్లకు రూపకల్పన చేసే విషయంలో చంద్రబాబు సిద్ధహస్తులు మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *