ఇంటిల్లిపాది భవిష్యత్తును గురించి ముందడుగు వేస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ముందుచూపుతో మన నీడలాగ ప్రతిక్షణం మన వెంట ఉండేది అమ్మ

అమ్మకు డబ్బులు విలువా తెలుసు. కాబట్టే లక్షరూపాయల వస్తువు కొంటున్నప్పుడు పదివేలైనా తగ్గించమని బేరమాడుతుంది.
అదేవిధంగా పది రూపాయలు పెట్టి ఆకుకూరలు కొంటున్నప్పుడు రూపాయి తగ్గించమనీ అడుగుతుంది.
తల్లిగా, భార్యగా, మెంటర్‌గా, కేర్‌టేకర్‌గా, కుక్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా ఆమెకు జీతం కనుక లెక్కగడితే అంకెలు సరిపోవు.
అందుకే గృహిణి బాధ్యత నిర్వహిస్తున్న మహిళలను సంపాదిస్తే తెలుస్తుంది అని చిన్నబుచ్చకూడదు.
కుటుంబానికి అమ్మ జీతం తీసుకోని సిఐవో. ఆ సంగతి మరిచిపోవద్దు. తను ఏ వస్తువును వృథా చేయదు.
ఒక్క అన్నం మెతుకును కింద పడనీయదు. నాలుగు బెండకాయలు మిగిలితే పడేయకుండా పులుసుకైనా వాడుతుంది.
పాత దుప్పట్లతో బొంత కుడుతుంది. పాత నోట్‌బుక్స్‌లోని కాగితాలను విడిగా తీసి, ఒక పుస్తకంగా చేసి జమాఖర్చులకు రాసుకునేందుకు వాడుతుంది.

వాడకుండా పక్కన పెట్టిన బట్టలను దాచిపెట్టి అవి ఉపయోగపడే వారికి ఇస్తుంది.
అమ్మ పోపులడబ్బా ఓ ఎమర్జెన్సీ ఫండ్. వేలకు వేలు సంపాదించే నాన్న కూడా నెలాఖరున ఓ వంద రూపాయల ఇవ్వమని అడుగుతాడు.
చివరి గురించి ఆలోచిస్తూ నెల మొదట్లో ఖర్చు చేయగల ముందు చూపు అమ్మకు మాత్రమే సొంతం.
అమ్మకు అప్పులంటే భయం. డబ్బు ఉన్నప్పుడే కొనమంటుంది. కొన్నప్పుడే ఆనందించమంటుంది.
క్రెడిట్ కార్డులు వాడేసి స్థోమతకు మించిన ఖర్చులు చేయడం తెలివి తక్కువని కోప్పడుతుంది.
లక్షరూపాయలు పెట్టి పెద్ద టీవి కొందామని ఇంటిల్లిపాది ప్రతిపాదిస్తే అమ్మ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ లక్షకు మరో లక్ష కలిపి మంచి కాలేజీలో చేరి చదువుకోవాలంటుంది. ఎందుకంటే అది వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు
సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఆర్థిక మానసికవేత్తలా మార్కెట్ శక్తుల వలలో పడదు. డిస్కౌంట్ల ప్రభావానికి లోనవదు.
కళ్ల ముందు కోటి సరుకులు కనిపించినా ప్రతి వస్తువు ఎంత వరకు అవసరం అన్నతీరులో అవసరం, అత్యవసరం అనుకుంటూ విభజిస్తుంది.
అత్యవసరం అనుకున్న వస్తువులనే ముందుగా కొంటుంది. మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు మాత్రమే అవసరం వైపు అడుగు వేస్తుంది. ఆ అవసరం కూడా తనకి కాదు, భర్తకీ పిల్లకీ. అందుకే అమ్మ మాట వినాలి.
అది ఎవరికైనా వరహాల మూటలా పనిచేస్తుంది. ఇంటిల్లిపాది భవిష్యత్తును గురించి ముందడుగు వేస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ముందుచూపుతో మన నీడలాగ ప్రతిక్షణం మన వెంట ఉండేది అమ్మ.
అమ్మ లేని జీవితం శూన్యం. అమ్మ ఉన్నంతకాలం అమ్మ మనసు నొప్పించకుండా బతికినవాడు జీవితం ధన్యం.